
నాది మైండ్‌గేమ్ కాదు: స్టీఫెన్‌సన్
ఓటుకు నోటు కేసులో నన్నెవరూ ఆడించలేదు: స్టీఫెన్‌సన్
హైదరాబాద్: ‘‘ఓటుకు నోటు వ్యవహారంలో నేను మైండ్‌గేమ్ ఆడలేదు. నాతో ఎవరూ మైండ్‌గేమ్ ఆడించలేదు’’ అని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డబ్బు ఎరజూపుతూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన స్టీఫెన్‌ను రాష్ర్టంలోని పలు క్రిస్టియన్, క్యాథలిక్ సంక్షేమ సంఘాలు మంగళవారం సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా స్టీఫెన్‌సన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన అంతరాత్మ ప్రబోధం మేరకే వ్యవహరించినట్లు చెప్పారు. ప్రజల కోసం, దేశం కోసం త్యాగాలు చేసిన వారే నిజమైన నాయకులని నమ్మే వ్యక్తినన్నారు.
సొంతలాభం కోసం పనిచేసే వారు నిజమైన నాయుకులు కాదన్నారు. తన ఆలోచనా విధానం ప్రకారమే వ్యవహరించానని, ఈ విషయంలో ఒత్తిళ్లు, తొందరపాటుతనం ఎంతమాత్రం లేదన్నారు. తన జీవితంలో కోట్ల రూపాయలను ఎప్పుడూ చూడలేదన్నారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తనకు దశాబ్దాల తరబడి చేసిన వ్యాపారంలో వ్యవహారమంతా కోటి రూపాయలను మించలేదన్నారు. స్వలాభం కోసమే చూసుకునే వాడినైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. ఐదు కోట్లు తీసుకునే వాడినని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలి పరిణామానికి ముందు తనను అంతా ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా చూసేవారని, కానీ ప్రస్తుతం క్రైస్తవ సంఘాల వారంతా తనను తమ బిడ్డగా, నిజాయితీకి ప్రతిరూపంగా చెప్పుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు.
తనకు ప్రమాదం పొంచి ఉందని, జాగ్రత్తగా ఉండాలని పలువురు శ్రేయోభిలాషులు సూచిస్తున్నారని స్టీఫెన్ పేర్కొన్నారు. తాను నమ్మిన జీసెస్ సిద్ధాంతాలే తనకు రక్షణ అని అన్నారు. తాను జీవితకాలం నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారమే నడుచుకున్నానని, అదే ధర్మాన్ని నాయకులందరూ పాటించాలన్నదే తన అభిమతమని చెప్పుకొచ్చారు. తనకు ఏదైనా జరిగితే వేలాది మంది స్టీఫెన్‌సన్లు పుట్టుకొస్తారని, తన స్ఫూర్తితో నీతిమంతమైన రాజకీయూలతో బంగారు తెలంగాణ సాధిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, స్టీఫెన్‌సన్ వ్యవహరించిన తీరు క్రైస్తవ సమాజానికి పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయని పలు సంఘాల ప్రతినిధులు కొనియాడారు. ఆయనకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. క్యాథలిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి లియో నేతృత్వంలో జరిగిన అభినందన కార్యక్రమంలో పలు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.