విదేశాల్లోనూ ‘జాదూ’ లీలలు
- ఏడేళ్లలో రూ.50 వేల కోట్ల కుంభకోణం?
సాక్షి, సిటీబ్యూరో: జాదూ టీవీ విదేశాల్లో కూడా తన స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఆయా దేశాల చానళ్ల ప్రసారాలను కూడా పైరసీ చేసిందని పోలీసుల విచారణలో తేలింది. ఒక దేశం ఛానల్స్‌ను పైరసీ చేసి.. ప్రపంచంలోని ఇతర దేశాలకు జాదూ టీవీ సెటప్‌బాక్స్ వినియోగదారులకు ప్రసారాలు పంపించడమే వృత్తిగా చేసుకుంది. జాదూ టీవీకి అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, దుబాయ్‌తో పాటు మరో 11 దేశాల్లో స్థావరాలు ఉన్నాయి.
మన దేశానికి చెందిన 115 ఛానళ్లను పైరసీకి కేంద్రంగా ఉన్న బోయిన్‌పల్లిలోని జాదూ టీవీ స్థావరంపై సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు దాడి చేయడంతో కేవలం ఒక్క స్థావరం మాత్రమే మూతపడింది. ఆయా దేశాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఏడేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగిస్తుండగా... తొలిసారిగా మన పోలీసులకు మాత్రమే చిక్కడం గమనార్హం. ఇతర దేశాల్లో ఉన్న తమ కార్యాలయాలపై కూడా దాడులు జరుగుతాయని భావించిన జాదూ టీవీ నిర్వాహకులు తమ స్థావరాలను ఖాళీ చేసి మరో ప్రాంతానికి తరలిస్తున్నారని తెలిసింది.
జాదూ టీవీ యజమాని సుమిత్‌హౌజా దుబాయి కేంద్రంగా నడుస్తున్న ‘క్లౌడ్‌స్ట్రీమ్ మీడియా’ గ్రూప్‌కు ఉపాధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాడు. జాదూ-1, జాదూ-2, జాదూ-3 అనే పేర్లతో కూడా కేబుల్ టీవీ ప్రసారాలు చేస్తామని వారి వెబ్‌సైట్‌లో వీరు ప్రకటనలు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల ఛానల్స్‌ను పైరసీ చేసిన ఇతను ఏడేళ్లలో సుమారు రూ.50,000 కోట్లు ఆర్జించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ముఠా వెనుక మాఫియా హస్తం కూడా ఉండవచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సుమిత్‌హౌజా గురించి సమాచారం అందించాలనుకునే తమను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ మొత్తం కుంభకోణం వెలుగు చూడాలంటే బాధిత దేశాల ఛానల్స్ మోల్కొనక తప్పదు.