
సాక్షి, సూర్యాపేట: గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సూర్యాపేటకు రానున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో శనివారం సంతోష్ బాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సంతోష్ బాబు సేవలు యువతకు స్ఫూర్తిగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలిపారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం సంతోష్ బాబు కుటుంబానికి రూ. 5కోట్ల ఎక్స్‌గ్రేషియాతో పాటు హైదరాబాద్‌లో 600 గజాల ఇంటిస్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. సంతోష్‌బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం.. అది కూడా ఆమెకు నచ్చిన ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. ప్రభుత్వ సాయంపై కేసీఆర్ వ్యక్తిగతంగా వారి కుటుంబాన్ని కలిసి చెప్పమన్నారు అని జగదీశ్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ సాయాన్ని సంతోష్ బాబు కుటుంబ సభ్యులు సంతోషంగా ఒప్పుకున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు. తమతో పాటు... దేశంలోని ఇతర సైనికులకు సాయం చేయడాన్ని వారు అభినందించారన్నారు. కొడుకు పోయిన బాధ కంటే దేశం కోసం చనిపోయాడని చెప్పడం వారి గొప్పతనానికి నిదర్శనమని జగదీశ్ రెడ్డి ప్రశంసించారు. కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం స్వయంగా సూర్యాపేటలోని వారి నివాసానికి వస్తారన్నారు. సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు సీఎమ్ రాకపైన సమాచారం ఇచ్చామని జగదీశ్ రెడ్డి తెలిపారు. (నేను ‘సంతోషం’గా ఒప్పుకుంటా..)
Comments
Please login to add a commentAdd a comment