సెక్షన్‌ 8 పెట్టాలనే డిమాండ్‌ అర్థరహితం | Jagadish Reddy and Talasani Srinivas Yadav Fires On BJP and Congress Party | Sakshi
Sakshi News home page

సెక్షన్‌ 8 పెట్టాలనే డిమాండ్‌ అర్థరహితం

Published Wed, Jul 8 2020 5:18 AM | Last Updated on Wed, Jul 8 2020 6:56 AM

Jagadish Reddy and Talasani Srinivas Yadav Fires On BJP and Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారిని నియంత్రించేందుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే విపక్షాలు మాత్రం ప్రతి అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్ర మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు ఉండగా, హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 విధించాలంటూ కాంగ్రెస్‌ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కుమార్‌తో కలిసి మంగళవారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కాంగ్రెస్, ఇతర పార్టీల వైఖరి ఇటీవలి కాలంలో మూర్ఖత్వానికి పరాకాష్టగా మారిందని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌ మోడల్‌గా తయారు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ దేశానికే ఆదర్శం గా మారిందని, వలస కార్మికుల విషయంలో అత్యంత మానవీయతను చూపారన్నారు. గతంలో ప్రగతిభవన్‌ నిర్మిస్తే విమర్శించిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు సచివాలయం నిర్మాణంపై ఏడుస్తున్నారని, కరోనాకంటే కాంగ్రెస్‌ దరిద్రమైన పార్టీ అని జగదీశ్‌రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని మంత్రి చెప్పారు. 

బీజేపీవి మత రాజకీయాలు..: కేసీఆర్‌ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, కొత్త సచివాలయం కూల్చివేస్తామంటూ విపక్ష నేతలు చేసే హెచ్చరికలు చూస్తూ కూర్చోబోమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనం నిర్మిస్తామని చెప్తున్న బీజేపీ రాష్ట్రంలో మాత్రం సచివాలయం విషయంలో దిక్కుమాలిన రాజకీయం చేస్తోందన్నారు. మత రాజకీయాలు తప్ప బీజేపీకి మరేమీ చేతకాదని, దేశానికే తలమానికంగా కొత్త సచివాలయం నిర్మిస్తామని తలసాని తెలిపారు. తమ పార్టీ మేనిఫెస్టోను మాత్రమే అమలు చేస్తున్నామని, సెక్షన్‌ 8 విషయంలో ప్రతిపక్షాలు అర్ధరహితంగా మాట్లాడుతున్నాయని రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా రాష్ట్రంలో వారు అధికారంలోకి రావడం అసాధ్యమని ఎంపీ పి.రాములు అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement