సాగునీటిపై టీఆర్‌ఎస్ సర్కార్ కృషి భేష్ ! | Janareddy comments on TRS government effort! | Sakshi
Sakshi News home page

సాగునీటిపై టీఆర్‌ఎస్ సర్కార్ కృషి భేష్ !

Published Fri, Nov 4 2016 3:41 AM | Last Updated on Thu, Aug 9 2018 4:48 PM

సాగునీటిపై టీఆర్‌ఎస్ సర్కార్ కృషి భేష్ ! - Sakshi

సాగునీటిపై టీఆర్‌ఎస్ సర్కార్ కృషి భేష్ !

ప్రశంసించిన సీఎల్పీ నేత కె.జానారెడ్డి
- 50 వేల ఎకరాలకు సాగునీరివ్వడం అభినందనీయం
- ఇరిగేషన్ అధికారుల పనితీరు బాగుందని కితాబు
- ఎంపీ గుత్తాతో కరచాలనం.. ఆప్యాయంగా పలకరింపు
- చర్చనీయాంశమైన అధికార, విపక్ష నేతల కలయిక
 
 పెద్దవూర: సీఎల్పీ నేత కె.జానారెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. నిన్నమొన్నటి వరకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడిన ఆయన.. రైతులకు సాగు నీటిని అందించే విషయమై ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. జానారెడ్డి, టీఆర్‌ఎస్ నేత, ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి గురువారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) లో లెవల్ వరదకాల్వ పంప్‌హౌస్ ట్రయల్ రన్ నిర్మాణ పనులను వేర్వేరుగా పరిశీలించారు. ఉదయం తొమ్మిది గంటలకే గుత్తా అక్కడికి చేరుకుని పనులు పరిశీ లించి తిరుగుపయనమయ్యారు.

ఇదే సమయం లో జానారెడ్డి అక్కడకు రాగానే గుత్తా పెద్దాయన వద్దకు వెళ్లారు. ఇద్దరూ కరచాలనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. అక్కడ ఏం చూసి వస్తున్నావ్ అంటూ గుత్తాను జానారెడ్డి ప్రశ్నించారు. ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించానని, సభా ప్రాంగణం ఏర్పాటు చేసే ప్రదేశాన్ని చూసి సూచనలు చేసి వస్తున్నట్లు సుఖేందర్‌రెడ్డి వివరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం జానారెడ్డి వరద కాల్వ పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తీవ్ర కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలోని ప్రజలకు 50 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఇది సంతోషకరమని వ్యాఖ్యానించారు.

వారం, పది రోజులుగా ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. రైతుల ఆకాంక్ష మేరకు పంప్‌హౌస్‌ను పరిశీలించటానికి వచ్చినట్లు జానారెడ్డి తెలిపారు. ఏఎమ్మార్పీ లో లెవల్ కెనాల్ పలు కారణాలతోనే ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. వచ్చే సీజన్ నాటికైనా ప్రాజెక్టు పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాజెక్టులో ఉన్న లోపాలను సరిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు వరదకాల్వ పరిశీలన సమయంలో కూడా గుత్తా విలేకరులతో మాట్లాడారు. 1997లో మంజూరైన ఈ ప్రాజెక్టు పనులు 19 ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో లక్ష్యాన్ని చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగు నీరు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుం దని కితాబిచ్చారు. అధికార, విపక్ష నేతల కలయిక, జానా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement