'సోనియాకు ధన్యవాదాలు చెబితే బాగుండేది'
హైదరాబాద్ : తెలంగాణ ఇచ్చిన యూపీఏ ప్రభుత్వానికి, సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపితే బాగుండేదని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అన్నారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఆయన శుక్రవారం సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీది అగ్రస్థానమన్నారు. తెలంగాణ విజయం అందరిదని, నవ తెలంగాణ నిర్మాణ బాధ్యత అందరిపై ఉందన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కాలపరిమితితో కూడిన ప్రణాళికలు అవసరమని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. సభలో సభ్యులు సహనంతో ప్రవర్తించాలని,ఆవేశంతో మాట్లాడకపోవటమే మంచిదని ఆయన సూచించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారో వివరించలేదని జానా అన్నారు. కాగా తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ అగ్రభాగంలో నిలిచిందని ఆయన ప్రశంసించారు.
కాగా అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు చట్టబద్ధత తెచ్చిన ఘటన కాంగ్రెస్ పార్టీదే అన్నారు. పంట రుణాలను త్వరగా మాఫీ చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు స్వాగతిస్తామన్నారు. కాగా తెలంగాణ ఇచ్చిన సోనియా పేరును గవర్నర్ ప్రసంగంలో స్మరించుకోకపోవటం బాధాకరమని గీతారెడ్డి వ్యాఖ్యానించారు.