చిల్పూరు: అమెరికాలో ఉంటున్న కుమారుడి వద్ద సంతోషంగా గడిపి తిరిగొస్తున్న తమను ముంబైలో నిలిపివేయడంతో 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన మ్యాదరబోయిన రవీందర్, ఝాన్నీ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ దంపతులు గతేడాది సెప్టెంబర్ 22న అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉంటున్న కుమారుడు ఉదయ్‌కుమార్ వద్దకు వెళ్లి ఈ ఏడాది మార్చి 19న తిరుగు ప్రయాణమయ్యారు. ఆరు నెలల తరువాత స్వగ్రామానికి వెళ్తున్నామనే ఆనందం వారిలో ఎంతో సేపు నిలవలేదు. మార్చి 20 మధ్యాహ్నం ముంబైలో విమానం దిగగానే అక్కడి సిబ్బంది వారి పాస్ పోర్టులు తీసుకుని ప్రత్యేక బస్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాక ఆస్పత్రిలో 22వ తేదీ వరకు ఉంచారు. మళ్లీ మార్చి 31న పరీక్షలు చేసి ఎలాంటి అనారోగ్యం లేదని నిర్ధారించాక ఓ గెస్ట్ హౌస్‌కు తరలించారు. అక్కడి నుంచి ఈనెల 2వ తేదీన ఓ ఫంక్షన్ హాల్‌కు మార్చారు. ఇక్కడ ఉండడంతో ఇబ్బందిగా రవీందర్, ఝాన్సీ దంపతులు ఫోన్ ద్వారా శనివారం ‘సాక్షి’దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు స్పందించి తమను స్వగ్రామానికి చేర్చాలని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment