జస్లిన్‌ కౌర్‌.. డాటర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ | Jasleen Kaur Is A Daughter Of Hyderabad Says Hyderabad CP Anjani Kumar | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 7 2018 8:47 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Jasleen Kaur Is A Daughter Of Hyderabad Says Hyderabad CP Anjani Kumar - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ‘నీట్‌’లో సరైన ర్యాంకు రాలేదన్న కారణంతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్న జస్లిన్‌ కౌర్‌ ఉదంతంపై నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ స్పందించారు. ఆమెను ‘డాటర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ అంటూ సంబోధించిన ఆయన.. విద్యార్థిని అకాల మరణం తీవ్రంగా కలచి వేసిందని వ్యాఖ్యానించారు. బుధవారం కొత్వాల్‌ విడుదల చేసిన ఆడియోలోని అంశాలు ఇలా.. ‘మెడికల్‌ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు రాలేదనే కారణంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. తన అత్యంత విలువైన జీవితాన్ని చాలా చిన్న వయసులోనే కోల్పోవడం నా గుండెను కదిలించింది. ఈ నష్టాన్ని, బాధను తట్టుకునే శక్తిని ఆమె కుటుంబీకులకు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. వివిధ రంగాల్లో నెలకొన్న అనారోగ్యకరమైన పోటీ చిన్ని హృదయాలపై ఎంతటి ప్రభావం చూపుతోందో, ఎంత ఒత్తిడికి గురిచేస్తోందో సమాజం ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

జీవితం కేవలం చదువుల కోసం కాదనే విషయాన్ని అర్థమయ్యేలా వివరించాలి. భవనాల యజమానులు తమ టెర్రాస్‌లకు ఉన్న తలుపులకు తాళం వేసి ఉంచడం ద్వారా ఆత్మహత్య చేసుకునే వారికి ఆ అవకాశం లేకుండా చేయాలని కోరుతున్నా. రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్స్, కమ్యూనిటీలు దీన్ని అమలు చేయాలి. ఈ కోణంలో అవగాహన కల్పించాల్సింగా అధికారులు, సిబ్బందిని ఆదేశిస్తున్నా. డాటర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. ప్రతికూల సమయాలు, సవాళ్లు భవిష్యత్తులో గుర్తుకు వస్తే మనం సాధించిన విజయాలు జ్ఞప్తికి వస్తాయనేది యువత గుర్తించాలి. ప్రతి రాత్రి వెనుక ఓ సూర్యోదయం ఉంటుందని మరువద్దు. సమస్యలు ఎదురైనప్పుడు జీవితంపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళండి.’ అని ఆయన సూచించారు.  

చాటింగ్స్‌పై మరో ఆడియో.. 
‘ఆన్‌లైన్‌ చాటింగ్‌కు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఉదంతాలు దాని తీవ్రత, దాని వల్ల జరిగే ప్రమాదాలను మాట్లాడేలా చేశాయి. టెక్టŠస్‌ మెసేజ్‌లతో కూడిన ఈ చాటింగ్‌ వల్ల తక్షణం సమాచార మార్పిడి జరుగుతుంది. అయితే అనేక సందర్భాల్లో ఒకరితో మరొకరికి పరిచయం ఉండట్లేదు. నిత్యం కొత్త స్నేహితులను పరిచయం చేసుకోవడం శుభపరిణామమే. అయితే సమాజంలో మంచి వాళ్లు ఉన్నట్టే చెడ్డ వాళ్లూ ఉంటున్నారు. వీరు నకిలీ ఐడీలు తయారు చేసుకుని ఇంటర్‌నెట్‌ ద్వారా కొందరితో పరిచయాలు చేసుకుని స్నేహితులుగా మారుతున్నారు. ఆపై అదును చూసుకుని పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

విద్యార్థులు ఈ ఉచ్చులో చిక్కుకోకూడదని కోరుతున్నా. సోషల్‌ మీడియాలో కామన్‌ ఫ్రెండ్స్‌ ఉన్న కొత్త వారినే స్నేహితులుగా మార్చుకోండి. అలా కాకుంటే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. యువ విద్యార్థుల్లో ఈ కోణంలో అవగాహన పెంచాల్సిందిగా పోలీసులను కోరుతున్నా. నకిలీ ఐడీలు సృష్టించడం కూడా నేరమే అని స్పష్టం చేయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువ విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నించాలి. దేశ నిర్మాణానికి భవిష్యత్తు తరాలే నిజమైన ఆస్తులు. అంతా కలిసి ఎలాంటి మోసాల బారినా పడకుండా వారిని కాపాడుకుందాం.’ అంటూ కొత్వాల్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement