
కింద కూర్చుని వినతిపత్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ అబ్దుల్ అజీమ్
భూపాలపల్లి: ఓ దివ్యాంగుడు లేవలేని స్థితిలో కలెక్టర్ గది వద్ద ఓ అర్జీ పట్టుకొని కూర్చున్నాడు. అటు నుంచి వచ్చిన కలెక్టర్ అబ్దుల్ అజీమ్.. అతని దీనస్థితిని గమనించి.. హోదాను పక్కనబెట్టి తాను సైతం కింద కూర్చొని సమస్యను ఓపికగా విన్నారు. నేనున్నానని, న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సంఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. సింగరేణి బొగ్గు గని ఏర్పాటులో ఇల్లు కోల్పోయిన తనకు పునరావాసం కల్పించాలని కోరేందుకు గణపురం మండలం ధర్మారావుపేట గ్రామపంచాయతీ పరిధిలోని మాధవరావుపల్లికి చెందిన దివ్యాంగుడు కల్లెబోయిన వెంకటేశ్వర్లు కలెక్టరేట్‌కు వచ్చాడు. (చదవండి: సొంతూళ్లోనే కాయకష్టం)
కలెక్టర్ గది వద్ద అతను వేచి ఉండగా.. అదే సమయంలో కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్ వచ్చారు. దీంతో వెంకటేశ్వర్లు పరిస్థితిని గమనించిన కలెక్టర్ చలించిపోయారు. తాను కూడా కింద కూర్చుని సమస్యను వినమ్రంగా విన్నారు. గని ఏర్పాటుకు ఇల్లు కోల్పోయిన తనకు సింగరేణి సంస్థ పరిహారం చెల్లించినా.. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించలేదని బాధితుడు వాపోయాడు. ఈ విషయాన్ని పరిశీలించి త్వరలో తగిన న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వెంకటేశ్వర్లు ఇంటికి బయలుదేరాడు. కాగా, గత ఫిబ్రవరిలో తన కార్యాలయం వద్ద మెట్లపై కూర్చుని నిరీక్షిస్తున్న గిరిజన వృద్ధురాలి పక్కనే కూర్చోని ఆమె సమస్యను కలెక్టర్ అబ్దుల్ అజీమ్ అక్కడికక్కడే పరిష్కరించి మన్నలు పొందారు. (కడుపులో కాటన్ కుక్కి ఆపరేషన్)
Comments
Please login to add a commentAdd a comment