సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి పదహారు సీట్లు గెలిచినా..కేంద్రంలో చేసేదేమీ ఉండదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నా రు. పదహారు సీట్లు తెచ్చుకున్న పార్టీలను ఢిల్లీలో కనీసం పలకరించే వారుండరని, కేవలం ఎంపీల సంఖ్యను చూపి కేసుల నుంచి బయటపడొచ్చని కేసీఆర్ భావిస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు కలసి రాజకీయ రాక్షస క్రీడ ఆడుతున్నాయని, వీరందరి లక్ష్యం నరేంద్రమోదీని తిరిగి ప్రధానిని చేయడమేనన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ శాసన సభాపక్ష (సీఎల్పీ) భేటీ జరిగింది. దీనికి ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పోడెం వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, పైలెట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డిలు హాజరయ్యారు. భేటీ అనంతరం వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్‌కుమార్‌తో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేసీఆర్‌కు ఈ పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్ర రాజకీయాలకు జీవన్ రెడ్డి గెలుపు మలుపు కాబోతుందని, కేసీఆర్ ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా 42 నియోజకవర్గాల ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తమ తీర్పును వెల్లడించారన్నారు.
దేశంలో నిశ్శబ్ద విప్లవం..
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించిన కనీస ఆదాయం పథకం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తు న్నారన్నారని భట్టి అన్నారు. ఈ పథకం దేశంలో నిశ్శబ్ద విప్లవం తేబోతుందన్నారు. దేశంలో ప్రజలమధ్య బీజేపీ ద్వేషాన్ని పెంచుతుంటే, రాహుల్ ప్రేమను పంచుతున్నారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి పదవికోసం ప్రాకులాడటం లేదన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య విలువలు నిలబడాలంటే రాహుల్ ప్రధాని కావడం ఒక్కటే మార్గమని అన్నా రు. తెలంగాణలో మజ్లిస్ పార్టీ టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తోందని, టీఆర్‌ఎస్ బీజేపీకి మద్దతు తెలుపుతోందని, మూడు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు.ప్రధాని మోదీకి కేసీఆర్ బి–టీమ్‌లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
నా గెలుపు ప్రభుత్వానికి కనువిప్పు: జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు ప్రభుత్వానికి కనువిప్పులాంటిదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రభుత్వ అప్రజాస్వామిక, నియంతృత్వ ధోరణికి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారన్నారు.ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థికి కేవలం 17శాతం ఓట్లు వచ్చాయని, 83శాతం విద్యావంతులు కేసీఆర్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ ,కొత్త ఉద్యోగాల నియామకాలను ప్రభుత్వం పక్కన బెట్టి అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఏపీలో రెండు డీఎస్సీలు నిర్వహించి మూడో డీఎస్సీకి సమాయత్తం అవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నియామకాన్ని చేపట్టలేదన్నారు. ఇకపై మండలిలో ప్రశ్నించే గొంతుగా తాను ఉంటానని స్పష్టం చేశారు. అంతకుముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జీవన్ రెడ్డిని భట్టి విక్రమార్క శాలువాతో సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment