వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా జెన్నారెడ్డి
రాష్ట్ర కార్యవర్గంలోకి విలియం, సుజాత, శివ
ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధిష్టానం
వరంగల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. జిల్లాకు చెందిన మునిగాల విలియం వైఎస్సార్‌పీపీ రాష్ట్ర కార్యదర్శిగా, సుజాత మంగీలాల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, గిడిగంటి శివ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. వైఎస్సార్‌పీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్ష పదవి రావడంపై జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మహేందర్‌రెడ్డికి పదవి రావడంతో మహబూబాబాద్ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, ఆయన అనుచరులు సంబరాలు జరుపుకున్నాయి. వైఎస్ కుటుంబంతో మహేందర్‌రెడ్డికి ఎంతో అనుబంధం ఉంది. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ మహమూబాబాద్ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
నమ్మకాన్ని నిలబెడతా : మహేందర్‌రెడ్డి
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నాపై నమ్మకంతో పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తా. వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే అభిమానం. ఆయన కుటుంబం కోసం దేనికైన సిద్ధమే. జగన్ వెంటనే నడుస్తాను. జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను.