
ఆదిలాబాద్ రూరల్: ఆదిమ గిరిజనుల్లోని పీటీజీ ఉప కులాల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం ఆధ్వర్యంలో పీటీజీ ఉపకులాల బహిరంగ సభ నిర్వహించారు. సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి సమస్యలను పలు దఫాలుగా సీఎంతో చర్చించినట్లు పేర్కొన్నారు. ఆర్‌ఎఫ్‌ఆర్‌వో ద్వారా పట్టాలు పొందిన గిరిజనులందరికీ పెట్టుబడి సాయం కింద రూ.4వేలు అందించనున్నట్లు తెలిపారు. పోడు భూములను సాగు చేస్తున్న వారి విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆదివాసీ గిరిజనులు ఇంకా సమస్యలతో సతమతమవుతున్నారని హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు.
ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్ మాట్లాడుతూ...లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొన్ని నెలలుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు మే 29న హన్మకొండలో మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సొనేరావు, ఆదివాసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment