వ్యభిచారులు.. నిర్వాహకులపైనే కేసులా?
*విటులనూ చట్ట పరిధిలోకి తేవాలి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార కేసుల్లో కేవలం వ్యభిచారులను, నిర్వాహకులనే మహిళల అక్రమ రవాణా, వ్యభిచార నిరోధక చట్టం 1956 కింద నేరస్తులుగా చూపుతుండటంపై ఉమ్మడి హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. లైంగికేచ్ఛ కోసం వ్యభిచార గృహాలకు వెళ్లే విటులను సైతం ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని అభిప్రాయపడింది.
ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని శాసనకర్తలను కోరింది. మహిళల అక్రమ రవాణా, వ్యభిచార నిరోధక చట్టం 1956 కింద మహ్మద్ షాహీద్ అనే విటునిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేస్తూ న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ గత వారం తీర్పు వెలువరించారు.
వ్యభిచార నిరోధక చట్టంలోని సెక్షన్ 3, 4, 5 సెక్షన్ల కింద విటునిపై పోలీసులు నమోదు చేసిన కేసులు చెల్లవని, అవి కేవలం వ్యభిచార నిర్వాహకులకు, వ్యభిచారులకే వర్తిస్తాయని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అయినప్పటికీ, లైంగికేచ్ఛ కోసం వ్యభిచార గృహాలకు వెళ్లే విటులను సైతం ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని ఈ తీర్పు ద్వారా శాసనకర్తలను అభ్యర్థిస్తున్నట్లు జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు తన తీర్పులో పేర్కొన్నారు.