భారత హాకీ మాంత్రికుడు ఇకలేడు
న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజ ఆటగాడు మొహమ్మద్ షాహిద్(56) కన్నుమూశాడు. గత కొంతకాలం నుంచి కిడ్నీ, లివర్ సంబంధిత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న షాహిద్ గుర్గావ్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
1980లో జరిగిన మాస్కో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో షాహిద్ కీలక ఆటగాడు. జూన్ 29న ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో బెనారస్ హిందూ వర్సిటీలోని ఎస్ఎస్ఎల్ హాస్పిటల్ కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం గుర్గావ్ లోని మెడంటా మెడిసిటీ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ నేడు షాహిద్ మృతిచెందారు. ఆయనకు భార్య ప్రవీన్ షాహిద్, ఇద్దరు సంతానం మహమ్మద్ సైఫ్, హీనా షాహిద్ ఉన్నారు.
1960 ఏప్రిల్ 14న యూపీలోని వారణాసిలో జన్మించిన షాహిద్.. 19 ఏళ్ల వయసులో జూనియర్ వరల్డ్ కప్(అండర్-19) లో ఫ్రాన్స్ పై చెలరేగి ఆడి విజయాన్ని అందించాడు. అక్కడి నుంచి అతని విజయ ప్రస్థానం రిటైరయ్యే వరకూ సాగింది. 1985-86 సీజన్లో హాకీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. సహచర ఆటగాళ్లతో ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడటంతో పాటు వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించేవాడు.
దూకుడుతో కూడిన వేగమే మంత్రంగా అతడు మైదానంలో చురగ్గా కదులుతూ తన ఆటతీరుతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకునేవారు. 1980 ఒలింపిక్ స్వర్ణం ఇచ్చిన ఉత్సాహంతోనే టీమిండియా 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిందని అప్పట్లో అందరూ చెప్పుకునేవారు. అంతటి స్ఫూర్తిని నింపిన దిగ్గజం మృతి హాకీకి తీరని లోటు. షాహిద్ సేవలను గుర్తించిన ప్రభుత్వం 1981 లో అర్జున అవార్డు, 1986లో పద్మశ్రీతో సత్కరించింది.