శనివారం హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో మాట్లాడుతున్న కోదండరాం
సాక్షి, హైదరాబాద్: సామాజిక రుగ్మతగా మారిన నిరుద్యోగంపై పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సరళీకర విధానాలతో నిరుద్యోగ సమస్య తీవ్రమైందని, నిరుద్యోగంపై మాట్లాడే వారు తక్కువయ్యారని పేర్కొన్నారు. శనివారం జేఏసీ నేతలు గోపాల శర్మ, రఘు, ఇటిక్యాల పురుషోత్తం, వెంకటరెడ్డి, భైరి రమేశ్, మాదు సత్యంతో కలసి మాట్లాడారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొలువుల కోసం కొట్లాట పేరిట సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగులంతా సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా సభ జరుగుతుందని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు రాకపోవడంతో నిరాశతో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను కూడా పిలిచి సభలో మాట్లాడిస్తామని చెప్పారు.
సభకు ఎంతమంది వచ్చినా ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వానికే స్పష్టత లేదని విమర్శించారు. ఉద్యోగాల కేలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు. ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాల్లో కీలకమైన ఉద్యోగాల గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ్డటీఆర్‌ఎస్ ప్రభుత్వం నడవడం లేదని ఆయన మండిపడ్డారు. ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీలను గుర్తుచేయకుండా సభ్యుల హక్కులను అసెంబ్లీలో కాలరాశారని ఆరోపించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల విషయంలోనూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని పేర్కొన్నారు.
ఎల్.రమణతో భేటీ..
కొలువుల కొట్లాటకు మద్దతు ఇవ్వాలని కోరు తూ టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను జేఏసీ చైర్మన్ కోదండరాం, నేతలు పురుషోత్తం, గోపాలశర్మ తదితరులు కలిశారు. కొలువుల కోసం కొట్లాట నిర్వహించేందుకు గల కారణాలను, మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. భేటీ తర్వాత రమణ మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని విమర్శించారు. కొలువుల కొట్లాటకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు.
ఆర్.కృష్ణయ్య మద్దతు..
కొట్లాటకు మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. ఈ మేరకు శనివారం బీసీ భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా కొలువుల కొట్లాటకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కృష్ణయ్య వెల్లడించారు.
3 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు
గతంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు తోడుగా, కొత్తగా పెరిగిన జిల్లాలతో అదనంగా పెరిగిన ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు. వివిధ శాఖల్లో ప్రస్తుతం 3 లక్షల దాకా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గుప్పెడు మంది ఆంధ్రా కాంట్రాక్టర్లను బతికించడానికి తెలంగాణ విద్యార్థులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం బలి పశువులను చేస్తోందని, దీనికి సంబంధించి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు. కొలువుల కొట్లాటను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అవరోధాలు ఎన్ని ఎదురైనా నిరుద్యోగులకు కొలువుల కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు. కొలువుల కోసం కొట్లాట సభలో విద్యార్థుల అభిప్రాయ సేకరణకు ప్రత్యేక వాల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 4వ తేదీన మధ్యాహ్నం 1 నుంచి 6 గంటల దాకా సభ జరుగుతుందని వివరించారు. సభకు హైకోర్టులో పర్మిషన్ తెచ్చుకోవడం విద్యార్థుల విజయంగా భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అమరుల ప్రాంగణానికి శ్రీకాంతాచారి పేరుతో వేదిక నిర్మించినట్లు వివరించారు. సభలో పాల్గొనాలని జర్నలిస్టు, రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల నేతలను కలిసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment