శాతవాహన యూనివర్సిటీ: మూల్యాంకనంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాలని శాతవాహన వీసీ ఆచార్య కడారు వీరారెడ్డి అన్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంనం బుధవారం ఆయన ప్రారంభించారు.
మూల్యాంకనం కోసం ఇచ్చిన సమయూన్ని అసిస్టెంట్ ఎగ్జామినర్స్, చీఫ్ ఎగ్జామినర్స్ విధిగా పాటించాలని అన్నారు. మార్కులు జమచేయడంలో, పేజీలు తప్పించి లెక్కిస్తే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని.. తప్పిదాలు జరగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమయపాలన పాటించనివారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అధ్యాపకులు చేసే మూల్యాంకనం విద్యార్థుల భవిష్యత్ అనే విషయాన్ని మరవరాదని అన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడడం నిషేధమని చెప్పారు.
అధిక మార్కులు సాధించడానికి కొందరు కోడ్స్, కొండ గుర్తులు వాడుతున్నట్లు గతంలో జరిగిందని.. అలాంటివి ఉంటే సంబంధిత పత్రాల గురించి కంట్రోలర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అలాంటి కళాశాలలపై కఠిన చర్యలకు వెనకాడమని అన్నారు. జిల్లాలోని అనేక మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలు, తెలుగు మాధ్యమం నుంచి వచ్చారని..
అలాంటి విద్యార్థులు రాసిన జవాబులను చదవాలని, పూర్తిగా పనికి రాని వాటిగా పరిగణించరాదని హితవు పలికారు. సీసీ కెమెరాల్లో మూల్యాంకన తీరును రికార్డు చేస్తున్నామన్నారు. మూల్యాంకన ప్రక్రియ పూర్తి అయ్యేవరకు సీసీ కెమెరాలు 24 గంటలు పని చేస్తాయని, అధ్యాపకులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.కోమల్‌రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య టి.భరత్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి దాస్యం సేనాధిపతి పాల్గొన్నారు.