ఆళ్లగడ్డ: జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 110 ఉన్నాయి. ఈ నెల 23 నుంచి డిగ్రీ సెమిస్టర్ –3, సెమిస్టర్ – 5 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. సుమారు 15 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అయితే, జంబ్లింగ్ పేరుతో వారికి కిలోమీటర్ల కొలది దూరంలో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. చదివే కళాశాలకు పరీక్ష కేంద్రాలు సుమారు 30 నుంచి 70 కి.మీ దూరంలో ఉన్నాయి. అక్కడికి చేరుకోవాలంటే రెండు నుంచి మూడు బస్సులు ఎక్కి దిగాలి. మరి కొన్నింటికి బస్సు సౌకర్యాలు లేవు. ఈ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు సుదూర ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల నిర్వాకం..విద్యార్థులకు శాపం
డిగ్రీ చదివేవారిలో అనేక మంది గృహిణులు, దివ్యాంగులు, బాలికలు ఉన్నారు. సుమారు 15 రోజుల పాటు ఉదయం 9 గంటలకే సుదూర ప్రాంతాల్లోని కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయడం వారికి కష్టమవుతుంది. కొన్ని మండలాల్లో డిగ్రీ కళాశాలలు లేకున్నా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేంద్రాలను కేటాయించారు. మరి కొన్న చోట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నప్పటికీ డిగ్రీ కళాశాలలు లేవని సాకు చూపుతూ సుదూర ప్రాంతాలకు పంపుతున్నారు. ఇటువంటి చర్యలతో రానున్న కాలంలో డిగ్రీ విద్యకు బాలికలు, వివాహితలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. రాయలసీమ యూనివర్సిటీ అ«ధికారులు స్పందించి దగ్గరలోని కేంద్రాల్లో పరీక్ష రాసే అవకాశం కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
అంతదూరం ఎలా వెళ్లేది?
జంబ్లింగ్ పేరుతో పరీక్ష కేంద్రం ఆదోనికి కేటాయించారు. మా ఊరు నుంచి అక్కడికి వెళ్లాలంటే సుమారు 30 కి.మీ. వెళ్లాలి. ఉదయం 9 గంటలకే పరీక్ష. అక్కడికి వెళ్లేందుకు బస్సులే ఉండవు. ఆటోల్లో అంత దూరం రోజు వెళ్లి పరీక్షలు రాసి రావడం చాల కష్టం. అందుకే ఇంట్లో వాళ్లు పరీక్షలు రాయొద్దు అంటున్నారు.
వరలక్ష్మి, డిగ్రీ ద్వితీయ సంవత్సరం, హŸళగుంద
మూడు బస్సులు మారాలి:
ఇంటర్ తర్వాత పై చదువులు వద్దు అని కుటుంబ సభ్యులు అడ్డుచెప్పినా పక్క గ్రామంలోనే కదా డిగ్రీ కళాశాల అని చెప్పడంతో సరే అని చేర్పించారు. ఇప్పుడు మా ఊరికి 45 కి. మీ. దూరంలోని ఎర్రగుంట్లలో పరీక్ష కేంద్రం ఇచ్చారు. అక్కడికి పోవాలంటే మూడు బస్సులు మారాలి. రోజు అంతదూరం వెళ్లి రావాలంటే మాలాంటికి వారికి ఇబ్బందే. అధికారులు స్పందించి సమీపంలో కేంద్రాన్ని కేటాయిస్తే బాగుంటుంది.
కల్పన, విద్యార్థిని, ఆలమూరు
నిబంధనల ప్రకారమే కేటాయించాం
ఆళ్లగడ్డ చుట్టపక్కల కళాశాలల్లో చదువుతున్న అభ్యర్థులకు ఆళ్లగడ్డ పట్టణంలో పరీక్ష కేంద్రం కేటాయించేందుకు ప్లేస్ చాలడం లేదు. అందుకే నంద్యాల, ఎర్రగుంట్ల లో కేంద్రాలు కేటాయించాం. పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటే విచారించి మార్చేందుకు చర్యలు తీసుకుంటాం.
– వెంకటేశ్వర్లు, రాయలసీమ
యూనివర్సిటీ పరీక్షల నిర్వహణాధికారి
Comments
Please login to add a commentAdd a comment