అధికారుల కనుసన్నల్లోనే...   | Junior Line Men Recruitment In Warangal | Sakshi
Sakshi News home page

అధికారుల కనుసన్నల్లోనే...  

Published Fri, Jul 12 2019 9:35 AM | Last Updated on Fri, Jul 12 2019 9:35 AM

Junior Line Men Recruitment In Warangal - Sakshi

సాక్షి, హన్మకొండ: అధికారుల కన్నుసన్నల్లోనే ఎన్పీడీసీఎల్‌ పరిధిలో చేపట్టిన పోల్‌ టెస్ట్‌(స్తంభం పరీక్ష)లో అక్రమాలు జరిగినట్లు తేటతెల్లమవుతోంది. లైన్‌మెన్ల ఎంపికకు నిర్వహించే పరీక్షలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకుని అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోం ది. అభ్యర్థులను గుర్తించడానికి ప్రత్యామ్నాయ అవకాశం ఉన్నా అదేమి పట్టించుకోకుండా తమ అనుయాయులు చెప్పిన వారిని పరీక్షలో పాస్‌ చేసేందుకు కొత్త ఎత్తుగడలు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

హాల్‌టికెట్‌ లేకపోతే..
ఎన్పీడీసీఎల్‌ పరిధిలో జూనియర్‌ లైన్‌మెన్ల నియామకానికి గత నెలలో పోల్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హాల్‌టికెట్లు జారీ చేయగా... అవి లేని పరిస్థితుల్లోనూ అభ్యర్థులను పరీక్షకు అనుమతించేందుకు ప్రభుత్వం అనుమతించింది. హాల్‌టికెట్‌ ఉంటే దానిపై ఉన్న ఫొటో ఆధారంగా పరీక్ష నిర్వహించాలి. ఒకవేళ లేకపోతే అఫిడవిట్‌ ఆధారంగా పోల్‌ టెస్ట్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఏదైనా తప్పు జరిగితే తమదే బాధ్యత అంటూ అభ్యర్థుల నుంచి  అఫిడపిట్లు స్వీకరించి పోల్‌ టెస్ట్‌కు అనుమతించారు.

దీనిని ఆసరాగా చేసుకున్న అధికారులు అక్రమాలకు తెరలేపారు. స్తంభం ఎక్కడంలో నిపుణులను తీసుకువచ్చి అసలు అభ్యర్థులకు బదులు స్థంభం ఎక్కించారు. ఈక్రమంలో నకిలీలను గుర్తించేందుకు అవకాశం ఉన్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా తంతు ముగించారు. నకిలీలకు అవకాశమిచ్చినా అధికారులు ఎక్కడ కూడా చిక్కకుండా అభ్యర్థులే తప్పుగా తేల్చేలా అఫిడవిట్‌ను అవకాశంగా తీసుకోవడం గమనార్హం.

ఉద్యోగం దక్కించుకోవాలన్న తపన
పోల్‌ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులను గుర్తు పట్టేందుకు కాల్‌ లెటర్‌తో పాటు రాత పరీక్షకు హాజరైన హాల్‌టికెట్‌ను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. ఈ మేరకు పిలుపు అందుకున్న అభ్యర్థులు పలువురు ఎలాగైనా ఉద్యోగం దక్కించుకోవాలనే భావనతో హాల్‌ టికెట్‌ పోయిందని చెప్పారు. దీనికి కొందరు అధికారులు సహకరించడంతో వారి పని సులువైంది. ఈ మేరకు అఫిడఫిట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. పొరపాటు చేస్తున్నామని తెలిసిన అధికారులు తాము చిక్కుకోకుండా ఉండేందుకు అభ్యర్థుల చేతిని వారి నెత్తిపైనే పెట్టారు.

అయితే, ఎన్పీడీసీఎల్‌ పరిధిలో నిర్వహించిన పోల్‌ టెస్ట్‌లో అభ్యర్థులను గుర్తించడానికి హాల్‌ టికెట్లు పరిశీలించడంతో పాటు తమ వద్ద ఉన్న దరఖాస్తులోని ఫోటోలతో సరి చూసుకున్నారు. అలాగే, అభ్యర్థి సంతకాన్ని కూడా సరిపోల్చుకున్నారు. ఇదంతా పాత నాలుగు సర్కిళ్లలో సాఫీగానే సాగినా ఆదిలాబాద్‌ సర్కిల్‌లో ఇవేమి పట్టించుకోకుండా తాము ఎంచుకున్న మార్గమే సరైన మార్గమంటూ అక్రమాలకు పాల్పడ్డారని అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోల్‌ టెస్ట్‌లో అసలు అభ్యర్థికి వరంగల్‌ సర్కిల్‌లో ఓ కాంటాక్టర్‌ వద్ద పని చేస్తూ స్తంభాలు ఎక్కడంలో మంచి పేరున్న వ్యక్తిని రంగంలోకి దింపారు. జూన్‌ 20న జరిగిన స్తంభం పరీక్షలో 104 సీరియర్‌ నంబర్‌గా ఉన్న శ్రావణ్‌కుమార్‌ స్థానంలో వరంగల్‌లోని ఓ కాంట్రాక్టర్‌ వద్ద పని చేస్తున్న బి.నవీన్‌ పాల్గొన్నారని ఆరోపిస్తున్న మిగతా అభ్యర్థులు.. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement