సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో గుంటూరు, ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా మూడు వేర్వేరు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయవాదిగా, జడ్జిగా పనిచేసిన జస్టిస్ పాలెం చెన్నకేశవరెడ్డి(96) శు క్రవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కడప జిల్లా తాటిమాకులపల్లిలో 1924, నవంబర్ 3న జన్మించిన చెన్నకేశవరెడ్డి ప్రాథమిక విద్యను పులివెందుల, డిగ్రీని అనంతపురం, లా డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. 1952లో న్యాయవాద వృత్తిని చేపట్టిన ఆయన క్రిమినల్ లాలో విశేష పరిజ్ఞానాన్ని సంపాదించారు. 1969లో సీబీఐకి స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేసిన ఆయన 1972లో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యా రు. 1984లో ఏపీ చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. 1985లో గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ అయి 1986లో పదవీ విరమణ చేశారు. ఆయన సికింద్రాబాద్ క్లబ్, కేబీఆర్ వాకింగ్ క్లబ్‌ల్లో సభ్యునిగా వ్యవహరించారు.
అలాగే చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన వారిలో అత్యధిక కాలం జీవించిన రికార్డు చెన్నకేశవరెడ్డిది. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఆయన నివాసంలో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు భౌతిక కాయాన్ని ఆప్తుల కడసారి సందర్శన కోసం ఉంచి, అనంతరం పంజాగుట్ట çశ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. జస్టిస్ చెన్నకేశవరెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment