Madhras High Court
-
హిందీ సూరరై పోట్రుకు లైన్‌క్లియర్
Madras High Court Green Signal To Remake Of Soorarai Pottru: సూరరై పోట్రు చిత్రం హిందీ రీమేక్‌కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాలు.. కథనాయకుడు సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన చిత్రం సూరరై పోట్రు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించడం తెలిసిందే. ఈ చిత్రాన్ని సూర్య అబున్డంటియా ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయరాదని, కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్ ఆధారంగా రచించిన సింప్లిఫై పుస్తక హక్కులు తమకు చెందినవి అంటూ సిఖ్యా ఎంటర్టైన్మెంట్ సంస్థ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి ప్రతిగా 2డి ఎంటర్టైన్మెంట్ సంస్థ చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. వాదనల అనంతరం న్యాయమూర్తి బుధవారం 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. -
ధనుష్‌పై హైకోర్టు ఆగ్రహం.. సామాన్యులే జీఎస్టీ కడుతుంటే..
చెన్నై: నటుడు ధనుష్‌కు మద్రాసు హైకోర్టు అక్షింతలు వేసింది. నటుడు ధనుష్ 2015లో రోల్స్‌రాయిస్ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. రాష్ట్ర రవాణశాఖ.. కారుకు ఎంట్రీ ట్యాక్స్ కట్టాల్సిందిగా ధనుష్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో ధనుష్ తన కారుకు ఎంట్రీ ట్యాక్స్ రద్దు చేయాల్సిందిగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు 50 శాతం ఎంట్రీ ట్యాక్స్ చెల్లించేలా ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసింది. గురువారం మరోసారి ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఎస్ ఎన్ సుబ్రమణియం ఉత్తర్వులో పిటిషన్‌దారుడు తను వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారని అయితే అందులో ఆయన పేరుకాని, వృత్తిగాని పొందుపరచకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా కోట్లు విలువ చేసే లగ్జరీ కారు కొని పన్ను మినహాయించాలని ఎలా అడుగుతున్నారంటూ కోర్టు మొట్టికాయలు వేసింది. మోటార్ సైకిల్‌పై పాల వ్యాపారం చేసుకునే వ్యక్తి కూడా పెట్రోల్‌కు జీఎస్టీ చెల్లిస్తున్నాడని అలాంటిది ధనుష్ ఎంట్రీ ట్యాక్స్ చెల్లించకపోవడంలో ఉద్దేశం ఏమిటని నిలదీసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, పన్ను చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ధనుష్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఇప్పటికే సగం పన్ను చెల్లించామని, మిగతా మొత్తాన్ని ఈనెల 9న చెల్లిస్తామని కోర్టుకు వివరణ ఇచ్చారు. -
ఆ జరిమానా చెల్లించడం ఇష్టం లేదు : విజయ్
చెన్నై: తనకు విధించిన రూ.లక్ష జరిమానా ప్రభుత్వ కరోనా నివారణ నిధికి చెల్లించడం ఇష్టం లేదని విజయ్ న్యాయస్తానానికి తెలిపారు. ఈయన ఇంగ్లాండ్‌లో కొనుగోలు చేసిన రోల్స్‌రాయిస్ కారుకు సంబంధించిన ట్యాక్స్ విషయంగా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్ఎం సుబ్రమణియం విజయ్‌కు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులపై తాత్కాలిక స్టే విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌కు విధించిన జరిమానా చెల్లింపునకు సంబంధించి ప్రకటన దాఖలు చేసే విషయంపై ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ ఎం సుబ్రమణ్యం సమక్షంలో బుధవారం విచారణ జరిగింది. జరిమానాను ప్రభుత్వ కరోనా నివారణ నిధికి ఎందుకు జమ చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు విజయ్ తరఫు న్యాయవాది గత ఏడాది ప్రభుత్వ కరోనా నివారణ నిధికి రూ.25 లక్షలు అందించినట్లు, అందువల్ల రూ.లక్ష జరిమానాను కరోనా నివారణ నిధిగా చెల్లించడం ఇష్టం లేదని తెలియచేశారు. దీంతో విజయ్‌పై కేసును ముగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
హైకోర్టులో ఏఆర్ రెహ్మాన్‌కు ఊరట
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏఆర్ రెహ్మాన్ 2000 సంవత్సరంలో ఒక సంగీత విభావరిని నిర్వహించారు. చెన్నైకి చెందిన కాళియప్పన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంగీత ప్రియులు ఆశించిన స్థాయిలో హాజరుకాలేదు. తాను ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రాలేదని, ఏఆర్ రెహ్మాన్ మాత్రం లబ్ధి పొందారని..తనకు నష్టపరిహారంగా రూ.3 కోట్లు చెల్లించాలని కాళియప్పన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును న్యాయమూర్తి ఆర్.సుబ్రమణియం శుక్రవారం విచారించారు. నిర్వాహకుడికి లాభం రాకపోవడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని రెహ్మాన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. లాభం లేదని చెబుతూ నిర్వాహకుడు తమకు ఇస్తానని ఒప్పుకున్న డబ్బు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి పిటిషన్‌దారుడు తరఫు న్యాయవాది వివరణ ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. -
టీకాపై వివాదాస్పద వ్యాఖ్యలు: నటుడు మన్సూర్‌కు బెయిల్
సాక్షి, చెన్నై: సినీ నటుడు మన్సూర్ అలీఖాన్‌కు మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. టీకా కొనుగోలు నిమిత్తం రూ. రెండు లక్షలు ఆరోగ్య శాఖకు చెల్లించాలన్న నిబంధనతో ఈ బెయిల్‌ను కోర్టు మంజూరు చేయడం గమనార్హం. కరోనా టీకా వేయించుకున్న హాస్య నటుడు వివేక్ ఆస్పత్రి పాలు కావడంతో నటుడు మన్సూర్ అలీఖాన్ తీవ్ర ఉద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. ఆ తర్వాత వివేక్ మరణించడం వంటి పరిణామాలతో కరోనా టీకా విషయంగా మన్సూర్ తీవ్రంగానే స్పందించారు. దీంతో టీకాపై అనుమానాలు, ఆందోళనలు బయలుదేరాయి. చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మన్సూర్ అలీఖాన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో అరెస్టు నుంచి గట్టెక్కేందుకు తొలుత సెషన్స్ కోర్టును మన్సూర్ అలీఖాన్ ఆశ్రయించారు. అయితే, ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. టీకా కోసం...రూ. రెండు లక్షలు.. సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో మద్రాసు హైకోర్టును మన్సూర్ అలీఖాన్ ఆశ్రయించాల్సి వచ్చింది. గురువారం ఈ పిటిషన్ న్యాయమూర్తి దండపాణి నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. మన్సూర్ తరఫు న్యాయవాది రాధాకృష్ణన్ వాదన వినిపిస్తూ, పథకం ప్రకారం లేదా, దురుద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఉద్వేగానికి లోనై ఆ వ్యా ఖ్యలు చేశారని, ఇందుకు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసినట్టు వివరించారు. వాదనల అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో టీకాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని మందలించారు. విజ్ఞానశాస్త్రంపై నమ్మకం ఉంచాలని, పరిశోధకులు, వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు అంటూ కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. చివరకు మన్సూర్ అలీఖాన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే, కరోనా టీకా కొనుగోలు నిమిత్తం ఆరోగ్యశాఖ కార్యదర్శిని కలిసి రూ. 2 లక్షలు అందజేయాలన్న నిబంధనను విధించారు. -
జస్టిస్ చెన్నకేశవరెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో గుంటూరు, ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ కేంద్రంగా మూడు వేర్వేరు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయవాదిగా, జడ్జిగా పనిచేసిన జస్టిస్ పాలెం చెన్నకేశవరెడ్డి(96) శు క్రవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కడప జిల్లా తాటిమాకులపల్లిలో 1924, నవంబర్ 3న జన్మించిన చెన్నకేశవరెడ్డి ప్రాథమిక విద్యను పులివెందుల, డిగ్రీని అనంతపురం, లా డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. 1952లో న్యాయవాద వృత్తిని చేపట్టిన ఆయన క్రిమినల్ లాలో విశేష పరిజ్ఞానాన్ని సంపాదించారు. 1969లో సీబీఐకి స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేసిన ఆయన 1972లో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యా రు. 1984లో ఏపీ చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. 1985లో గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ అయి 1986లో పదవీ విరమణ చేశారు. ఆయన సికింద్రాబాద్ క్లబ్, కేబీఆర్ వాకింగ్ క్లబ్‌ల్లో సభ్యునిగా వ్యవహరించారు. అలాగే చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన వారిలో అత్యధిక కాలం జీవించిన రికార్డు చెన్నకేశవరెడ్డిది. ఆదివారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఆయన నివాసంలో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు భౌతిక కాయాన్ని ఆప్తుల కడసారి సందర్శన కోసం ఉంచి, అనంతరం పంజాగుట్ట çశ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. జస్టిస్ చెన్నకేశవరెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. -
హిజ్రాలను ఏ జైల్లో నిర్బంధించాలి?
సాక్షి, చెన్నై : సాధారణంలో జైల్లో మహిళలకు, పురుషులకు వేరువేరుగా జైళ్లు ఉంటాయి. కానీ థర్డ్ జెండర్ ( హిజ్రా)లకు ప్రత్యేకంగా కారాగారాలు లేవు. ఈ నేపథ్యంలోనే హిజ్రాలను ఎక్కడ నిర్బంధించాలని అనే దానిపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఓ కేసు విచారణ నిమిత్తం.. కింద కోర్టులకు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తమిళనాడు, పుదుచ్చేరిలో గల సెషన్స్ కోర్టులకు హైకోర్టు కొత్త నింబంధనలు రూపొందించింది. ఈ నింబంధన రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో విడుదల చేశారు. కొత్త నిబంధనల ప్రకారం అరెస్టయిన వారిని నేరుగా హాజరుపరిస్తే మాత్రమే వారిని జైలుల్లో నిర్బంధించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని, నేర కేసుల్లో అరెస్లయిన హిజ్రాలను జిల్లా వైద్య అధికారిచే పరీక్షలు జరిపించాలని పేర్కొంది. ఈ నివేదన ఆధారంగా మగ లక్షణాలు అధికంగా ఉంటే పురుషుల జైలుల్లో, ఆడ లక్షణాలు ఎక్కువగా ఉంటే మహిళల జైలులో నిర్బంధించవచ్చని హైకోర్టు తెలిపింది. ఇలాంటి సందర్భంగా చాలా అరుదుగా ఎదురువుతాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. -
తమిళ విద్యార్థులకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌ను తమిళ భాషలో రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇటీవల జారీచేసిన ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాన్ని తప్పుపడుతు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సుప్రీంకోర్టు పిట్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎ ఎస్ బాంబ్డే, ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఈ పద్దతిలో విద్యార్థులకు మార్కులు ఇవ్వలేమని, ఇరువురు సమావేశమై సమస్యను పరిష్కారించాలని న్యాయస్థానం పేర్కొంది. నీట్ పరీక్షా ప్రశ్నాపత్రంలోని తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లాయంటూ సీపీఐ(ఎమ్) నేత టీకే రంగరాజన్ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. 49 ప్రశ్నలు తప్పుగా అనువాదం చేసినందు వల్ల గందరగోళానికి గురైన విద్యార్థులు మార్కులు కోల్పోయారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మధురై బెంచ్ సీబీఎస్ఈ తీరును తప్పు పట్టింది. తమిళ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మధురై బెంచ్ సీబీఎస్‌ఈను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో సుమారు 24 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. -
యూనివర్సిటీలకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : యూనివర్సిటీలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ, ప్రవేటు యూనివర్సిటీలు ఏకపక్షంగా ఫీజలు పెంచకూడదంటూ అత్యన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తమిళనాడులోని అన్నమలై యూనివర్సిటీకి చెందిన ఎమ్‌బీబీఎస్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం ఆదివారం విచారించింది. రుసుముల నియంత్రణ కమిటీని సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచి విద్యార్థులపై భారం మోపొద్దని తీర్పులో పేర్కొంది. 2013-14 విద్యా సంవత్సరంలో అన్నమలై యూనివర్సిటీ ఏడాదికి 5.54 లక్షలు ఫీజు పెంచడంతో ఎమ్‌బీబీఎస్, బీడీఎస్ విద్యార్థులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా, యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం 2003లో రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుకు విరుద్ధంగా ఉందంటూ వ్యాఖ్యానించింది. ప్రతి రాష్ట్రం సొంతగా ఫీజుల నియంత్రణ కమిటీని కలిగి ఉండాలని, ఆ కమిటీని సంప్రదించి మాత్రమే ఫీజులు పెంచాలని 2003లో సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సూచించింది. 1992 చట్టం ప్రకారం మరో రెండు వారాల్లో యూనివర్సిటీ బ్యాలెన్స్ షీట్‌ను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎమ్‌బీబీఎస్‌కు 12,290, బీడీఎస్ కోర్సుకు 10,290 వసూలు చేయాలని పేర్కొంది. -
రేపిస్టులకు అదే సరైన శిక్షా?
న్యూఢిల్లీ: దేశంలో అమ్మాయిలపై, ముఖ్యంగా బాలికలపై పెరిగిపోతున్న అత్యాచారాలను అరికట్టాలంటే రేపిస్టులను ఉరితీయడం ఒక్కటే మార్గమన్న ఆవేదనాపరుల నినాదం నేడు మారిపోయింది. కామవాంఛ కలుగుకుండా బీజకోశాలను (క్యాస్ట్రేషన్) కత్తిరించడం ఒక్కటే మార్గమన్న కొత్త నినాదం పుట్టుకొచ్చింది. అమానుషమైనప్పటికీ ఇదే సరైన గుణపాఠమార్గమని సాక్షాత్తు మద్రాసు హైకోర్టే అక్టోబర్ 16వ తేదీన అభిప్రాయపడడం ఈ నినాదానికి కొత్త ఊపునిచ్చింది. వాస్తవానికి మూడేళ్ల క్రితం ఢిల్లీలో నిర్భయపై దారుణ అత్యాచారం జరిగిన నాటి నుంచే క్యాస్ట్రేషన్ శిక్ష అవసరమన్న ప్రచారం మొగ్గతొడిగింది. నిర్భయ సంఘటన అనంతరం ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ క్యాస్ట్రేషన్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. మానవ హక్కులను ఉల్లంఘించడమేనని, సామాజిక సమస్య అయిన అత్యాచారాలకు అది పరిష్కారమూ కూడా కాదని తేల్చి చెప్పింది. తమిళనాడుకు చెందిన ముక్కుపచ్చలారని ఓ చిన్నారిపై ఓ బ్రిటీష్ దేశస్థుడు ప్రదర్శించిన పైశాచికత్వ సంఘటన కేసును విచారిస్తున్న మద్రాస్ హైకోర్టు జస్టిస్ ఎన్. కిరుబాకరన్ తీవ్రంగా స్పందించి రేపిస్టులకు క్యాస్ట్రేషన్ శిక్ష విధించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మళ్లీ చర్చ ఊపందుకోంది. అసలు ‘క్యాస్ట్రేషన్’ అంటే ఏమిటీ? వీర్యాన్ని ఉత్పత్తి చేసి, పురాషాంగాన్ని ప్రేరేపించే వృషనాల్లోని సెక్స్ గ్రంధి లేదా బీజ కోశాలను పనిచేయకుండా చేయడాన్నే ‘క్యాస్ట్రేషన్’ అంటారు. ఇందులో రెండు రకాలు. ఒకటి...బీజ కోశాలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించడం, రెండో పద్ధతి రసాయనిక మందులను ఇంజక్షన్ ద్వారా పంపించి బీజ కోశాలను పనిచేయకుండా చేయడం. కెమికల్ క్యాస్ట్రేషన్ ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో 13 ఏళ్ల లోపు పిల్లలపై అత్యాచారం జరిపితే కెమికల్ క్యాస్ట్రేషన్ శిక్షను 1996లో తొలిసారిగా ప్రవేశపెట్టారు. మొదటిసారి రేప్‌నకు పాల్పడితే జడ్జి తన విచక్షణాధికారాలను ఉపయోగించి నిర్ణయం తీసుకుంటారు. అదే వ్యక్తి రెండోసారి నేరానికి పాల్పడితే తప్పనిసరిగా కెమికల్ క్యాస్ట్రేషన్ శిక్ష విధిస్తారు. ఇప్పుడు కాలిఫోర్నియా రాష్ట్రంతోపాటు అమెరికాలోని ఐయోవా, విస్కాన్సిన్, టెక్సాస్, ఓరేగాన్, లూసియానా రాష్ట్రాల్లో అమలులో ఉంది. యూరప్, పోలండ్ దేశాల్లో 2010లో, మోల్దోవా, ఎస్టోనియా దేశాల్లో 2012లో, దక్షిణ కొరియా 2013లో ఈ చట్టం తీసుకరాగా, త్వరలో ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని గతవారమే ఇండోనేసియా అటార్నీ జనరల్ ప్రకటించారు. మరికొన్ని దేశాల్లో శిక్ష పడిన నేరస్థులే స్వచ్ఛందంగా ముందుకొస్తే కెమికల్ క్యాస్ట్రేషన్ అమలుచేసే పద్ధతి అమల్లో ఉంది. శస్త్ర చికిత్స ద్వారా ‘క్యాస్ట్రేషన్’ను రేపిస్టులకు అమలుచేసే పద్ధతి ఏ దేశంలోనూ లేదు. కెమికల్ క్యాస్ట్రేషన్కు ఒక్కసారి ఇంజెక్సన్ ఇస్తే సరిపోదు. అది ఓ కోర్సులాగా ఇస్తూ పోవాలి. ఎముకలు దెబ్బతినడం లాంటి దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. దేశంలో బాలికలపై అత్యాచారాలను అరికట్టడానికి ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్’ను భారత ప్రభుత్వం తీసుకొచ్చినప్పటీకీ బాలికలపై అత్యాచారాలు ఆగకపోగా పెరుగుతూనే ఉన్నాయి. 2012 నాటికి దేశంలో 38,172 కేసులు నమోదుకాగా 2014 నాటికి అవి 89,423 కేసులకు పెరిగాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీటిలో నేరస్థులకు శిక్ష పడుతున్న కేసులు మాత్రం 2.4 శాతానికి మించడం లేదు. ఈ లెక్కల ఆధారంగా రోజురోజుకు బాలికలపై అత్యాచారాలు పెరుగుతున్నట్టుగా భావించరాదని, గతంలో అత్యాచారాలపై ఫిర్యాదు చేయడానికి వెనకాడేవారని, ఇప్పుడు ముందుకొచ్చి ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తుండడం వల్లనే అత్యాచారాలు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నాయని కొన్ని బాలల హక్కుల పరిరక్షణ సంఘాలు తెలియజేస్తున్నాయి. దేశంలో బాధితలను ఎల్లవేళలా రక్షించే వ్యవస్థ ఉన్నట్టయితే ఈ ఫిర్యాదుల సంఖ్య మరింతగా పెరుగుతాయని ఆ సంఘాలు చెబుతున్నాయి. రేపిస్టులకు కఠిన శిక్షలు అమలు చేయడం పెరిగితే వారు సాక్ష్యాధారాలను నిర్మూలించేందుకు బాధితుల హత్యలకు తెగబడే ప్రమాదం ఉందని సామాజిక సంస్థలు వాదిస్తున్నాయి. రేప్ అనేది సామాజిక, సాంస్కృతిక సమస్యని, సంస్కృతిని పెంపొందించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చని తెలియజేస్తున్నాయి. రేప్ అనేది మెదడు ప్రోద్బలంతో జరిగే ప్రక్రియని, మెదడు తప్పుచేస్తే వృషణాలకు శిక్ష విధించడం ఏమిటని వైద్య విజ్ఞాన నిపుణులు అంటున్నారు.