రేపిస్టులకు అదే సరైన శిక్షా? | 'Castration' order: Patriarchy is the problem but Madras HC proposes it as panacea for rape | Sakshi
Sakshi News home page

రేపిస్టులకు అదే సరైన శిక్షా?

Published Wed, Oct 28 2015 2:21 PM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

రేపిస్టులకు అదే సరైన శిక్షా?

రేపిస్టులకు అదే సరైన శిక్షా?

న్యూఢిల్లీ: దేశంలో అమ్మాయిలపై, ముఖ్యంగా బాలికలపై పెరిగిపోతున్న అత్యాచారాలను అరికట్టాలంటే రేపిస్టులను ఉరితీయడం ఒక్కటే మార్గమన్న ఆవేదనాపరుల నినాదం నేడు మారిపోయింది. కామవాంఛ కలుగుకుండా బీజకోశాలను (క్యాస్ట్రేషన్) కత్తిరించడం ఒక్కటే మార్గమన్న కొత్త నినాదం పుట్టుకొచ్చింది. అమానుషమైనప్పటికీ ఇదే సరైన గుణపాఠమార్గమని సాక్షాత్తు మద్రాసు హైకోర్టే అక్టోబర్ 16వ తేదీన అభిప్రాయపడడం ఈ నినాదానికి కొత్త ఊపునిచ్చింది. వాస్తవానికి మూడేళ్ల క్రితం ఢిల్లీలో నిర్భయపై దారుణ అత్యాచారం జరిగిన నాటి నుంచే క్యాస్ట్రేషన్ శిక్ష అవసరమన్న ప్రచారం మొగ్గతొడిగింది.

నిర్భయ సంఘటన అనంతరం ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ క్యాస్ట్రేషన్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. మానవ హక్కులను ఉల్లంఘించడమేనని, సామాజిక సమస్య అయిన అత్యాచారాలకు అది పరిష్కారమూ కూడా కాదని తేల్చి చెప్పింది. తమిళనాడుకు చెందిన ముక్కుపచ్చలారని ఓ చిన్నారిపై ఓ బ్రిటీష్ దేశస్థుడు ప్రదర్శించిన పైశాచికత్వ సంఘటన కేసును విచారిస్తున్న మద్రాస్ హైకోర్టు జస్టిస్ ఎన్. కిరుబాకరన్ తీవ్రంగా స్పందించి రేపిస్టులకు క్యాస్ట్రేషన్ శిక్ష విధించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై మళ్లీ చర్చ ఊపందుకోంది.

అసలు ‘క్యాస్ట్రేషన్’ అంటే ఏమిటీ?
వీర్యాన్ని ఉత్పత్తి చేసి, పురాషాంగాన్ని ప్రేరేపించే వృషనాల్లోని సెక్స్ గ్రంధి లేదా బీజ కోశాలను పనిచేయకుండా చేయడాన్నే ‘క్యాస్ట్రేషన్’ అంటారు. ఇందులో రెండు రకాలు. ఒకటి...బీజ కోశాలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించడం, రెండో పద్ధతి రసాయనిక మందులను ఇంజక్షన్ ద్వారా పంపించి బీజ కోశాలను పనిచేయకుండా చేయడం. కెమికల్ క్యాస్ట్రేషన్ ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో 13 ఏళ్ల లోపు పిల్లలపై అత్యాచారం జరిపితే కెమికల్ క్యాస్ట్రేషన్ శిక్షను 1996లో తొలిసారిగా  ప్రవేశపెట్టారు. మొదటిసారి రేప్‌నకు పాల్పడితే జడ్జి తన విచక్షణాధికారాలను ఉపయోగించి నిర్ణయం తీసుకుంటారు. అదే వ్యక్తి రెండోసారి నేరానికి పాల్పడితే తప్పనిసరిగా కెమికల్ క్యాస్ట్రేషన్ శిక్ష విధిస్తారు.

ఇప్పుడు కాలిఫోర్నియా రాష్ట్రంతోపాటు అమెరికాలోని ఐయోవా, విస్కాన్సిన్, టెక్సాస్, ఓరేగాన్, లూసియానా రాష్ట్రాల్లో అమలులో ఉంది. యూరప్, పోలండ్ దేశాల్లో 2010లో, మోల్దోవా, ఎస్టోనియా దేశాల్లో 2012లో, దక్షిణ కొరియా 2013లో ఈ చట్టం తీసుకరాగా, త్వరలో ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని గతవారమే ఇండోనేసియా అటార్నీ జనరల్ ప్రకటించారు. మరికొన్ని దేశాల్లో శిక్ష పడిన నేరస్థులే స్వచ్ఛందంగా ముందుకొస్తే కెమికల్ క్యాస్ట్రేషన్ అమలుచేసే పద్ధతి అమల్లో ఉంది. శస్త్ర చికిత్స ద్వారా ‘క్యాస్ట్రేషన్’ను రేపిస్టులకు అమలుచేసే పద్ధతి ఏ దేశంలోనూ లేదు. కెమికల్ క్యాస్ట్రేషన్‌కు ఒక్కసారి ఇంజెక్సన్ ఇస్తే సరిపోదు. అది ఓ కోర్సులాగా ఇస్తూ పోవాలి. ఎముకలు దెబ్బతినడం లాంటి దుష్పరిణామాలు కూడా ఉన్నాయి.

దేశంలో బాలికలపై అత్యాచారాలను అరికట్టడానికి ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్’ను భారత ప్రభుత్వం తీసుకొచ్చినప్పటీకీ బాలికలపై అత్యాచారాలు ఆగకపోగా పెరుగుతూనే ఉన్నాయి. 2012 నాటికి దేశంలో 38,172 కేసులు నమోదుకాగా 2014 నాటికి అవి 89,423 కేసులకు పెరిగాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీటిలో నేరస్థులకు శిక్ష పడుతున్న కేసులు మాత్రం 2.4 శాతానికి మించడం లేదు.

ఈ లెక్కల ఆధారంగా రోజురోజుకు బాలికలపై అత్యాచారాలు పెరుగుతున్నట్టుగా భావించరాదని, గతంలో అత్యాచారాలపై ఫిర్యాదు చేయడానికి వెనకాడేవారని, ఇప్పుడు ముందుకొచ్చి ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తుండడం వల్లనే అత్యాచారాలు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నాయని కొన్ని బాలల హక్కుల పరిరక్షణ సంఘాలు తెలియజేస్తున్నాయి. దేశంలో బాధితలను ఎల్లవేళలా రక్షించే వ్యవస్థ ఉన్నట్టయితే ఈ ఫిర్యాదుల సంఖ్య మరింతగా పెరుగుతాయని ఆ సంఘాలు చెబుతున్నాయి.

రేపిస్టులకు కఠిన శిక్షలు అమలు చేయడం పెరిగితే వారు సాక్ష్యాధారాలను నిర్మూలించేందుకు బాధితుల హత్యలకు తెగబడే ప్రమాదం ఉందని సామాజిక సంస్థలు వాదిస్తున్నాయి. రేప్ అనేది సామాజిక, సాంస్కృతిక సమస్యని, సంస్కృతిని పెంపొందించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చని తెలియజేస్తున్నాయి. రేప్ అనేది మెదడు ప్రోద్బలంతో జరిగే ప్రక్రియని, మెదడు తప్పుచేస్తే వృషణాలకు శిక్ష విధించడం ఏమిటని వైద్య విజ్ఞాన నిపుణులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement