ఆంతర్యం ఏంటో?
యూనివర్సిటీ ఏర్పాటుపై సరైన హామీ ఇవ్వని కేసీఆర్
‘తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఖాయం. ఏర్పాటు చేసే యూనివర్సిటీకి కొమురం భీమ్ గిరిజన యూనివర్సిటీగా పేరు పెడుతాం.’
- ఇవీ బుధవారం జోడేఘాట్‌లో కొమురం భీమ్ వర్ధంతిలో పాల్గొన్న సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు.
ఉట్నూర్ : కొమురం భీమ్ వర్ధంతి వేడుకల నిర్వహణకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో ఆదిలాబాద్ జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ సమయంలో గిరిజనుల్లో ఆశలు చిగురించాయి. అయితే.. బుధవారం భీమ్ వర్ధంతిలో పాల్గొన్న సీఎం ఆ విషయంపై స్పష్టత ఇష్టారని అందరూ భావించినా.. కానీ, ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీనికితోడు తెలంగాణలో ఏర్పాటు చేసే గిరిజన యూనివర్సిటీకి కొమురం భీమ్ పేరు పెడుతామంటూ ప్రకటన చేయడంతో అందరిలోనూ అయోమయం నెలకొంది. జిల్లా అంతగా చర్చ మొదలైంది. వెంటనే ప్రభుత్వం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత ప్రకటన చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.
యూనివర్సిటీ ఏర్పాటుతో అభివృద్ధి
జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 4,95,794 ఆదివాసీ గిరిజన జనాభా ఉంది. జిల్లావ్యాప్తంగా తొమ్మిదికి పైగా గిరిజన తెగలు జీవిస్తున్నారు. గోండులు 2,63,515, లంబాడాలు 1,12,793, కోలాంలు 38,176, పర్‌దాన్‌లు 26,029, మన్నెవార్‌లు 15,370, నాయక్‌పోడ్‌లు 5,206, తోటీలు 2,231, కోయ 1,735, ఇతర తెగలు 30,739 చొప్పున ఉన్నారు. గిరిజన యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటు అయితే అందరూ విద్యాభివృద్ధి సాధించే అవకాశం లేకపోలేదు. అంతేగాకుండా మరికొందరికి ఉద్యోగ అవకాశాలూ లభిస్తాయి.