ప్రజాప్రతినిధులదే భారం
గిరిజన యూనివర్సిటీపై చిగురిస్తున్న ఆశలు
ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడటం, సీఎం కేసీఆర్ ప్రధానికి విన్నవించిన వాటిలో గిరిజన యూనివర్సిటీ అంశం ఉండటంతో మళ్లీ ఈ విషయం తెరమీదికి వచ్చింది. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797ను విడుదల చేసింది.
దీనికి అనుగుణంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2011 ఆగస్టు 27న జిల్లాలో గిరిజన యునివర్సిటీ ఏర్పాటుకు జీవో నంబర్ 783ను విడుదల చేసింది. జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాగం ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల ప్రభుత్వానికి చెందిన 470 ఎకరాల పరం పోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించింది. అలాగే 7వ నంబరు జాతీయ రహదారికి 34 కి.మీల దూరంలో రవాణా సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్తు తదితర సౌకర్యాలు ఉన్నట్లు ఐటీడీఏ, జిల్లా అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించా రు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో యూనివర్సిటీ అంశం మరుగున పడింది.
అయితే గత జనవరిలో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా) కింద రాష్ట్రంలో 12 కొత్త యూనివర్సిటీల ఏర్పాటు కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనల్లో జిల్లాలోని నిర్మల్ లో యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రతిపాదనలు పంపింది. దీంతో అడవి బిడ్డలకు కేంద్రంగా గిరిజన యునివర్సిటీ ఏర్పాటు జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
జిల్లా ప్రజాప్రతినిధులదే భారం
జిల్లాలో గిరిజన యునివర్సిటీ ఏర్పాటు జరుగాలంటే మన జిల్లా ప్రజాప్రతినిధులే కీలకమని అడవిబిడ్డలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలో ఉండటం, జిల్ల్లా ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకొవడం, బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేలు చేరడం, ఇద్దరు ఎంపీలు కూడా టీఆర్‌ఎస్ వాళ్లే కావడం, జిల్లాకు మంత్రి పదవి దక్కడంతో ప్రజాప్రతినిధులు ప్రభుతవపై ఒత్తిడి తెస్తే సులువవుతుందని గిరిజనులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మన జిల్లాలో కాకుండా వేరే జిల్లాకు యూనివర్సిటీ తరలిపోతే మన జిల్లా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే అవుతుంది. యునివర్సిటీ ఏర్పాటుకు మనవారు ప్రభుత్వంపై ఎంతవరకు ఒత్తిడి తెస్తారో చూడాలి.