పట్టుబట్టారు.. పట్టుకొచ్చారు! | Kakatiya Medical college Ready To Diamond Jubilee Celebations | Sakshi
Sakshi News home page

పట్టుబట్టారు.. పట్టుకొచ్చారు!

Published Fri, Jul 19 2019 11:27 AM | Last Updated on Fri, Jul 19 2019 11:27 AM

Kakatiya Medical college Ready To Diamond Jubilee Celebations - Sakshi

వజ్రోత్సవాలకు ముస్తాబైన కేఎంసీ ప్రధాన భవనం

నాడు మహబూబాబాద్‌ ఎంపీగా కొనసాగిన ఇటిక్యాల మధుసూదన్‌రావు, అప్పటి వరంగల్‌ కలెక్టర్‌ మొహసిన్‌ బీన్‌ షబ్బీర్‌ సంకల్పం బలమే నేటి కాకతీయ మెడికల్‌ కళాశాల(కేఎంసీ) స్థాపనకు కారణమైందని చెప్పాలి. 1959లో కలెక్టర్‌ షబ్బీర్‌ రూపొందించిన ప్రతిపాదనలను ఎంపీ మధుసూదన్‌ వెంట తీసుకెళ్లి అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూను కలిసి తెలంగాణలోని వరంగల్‌ ప్రాంతంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. అంతేకాకుండా ఒకటికి, రెండుసార్లు కలిసి పట్టుబట్టడంతో కళాశాల స్థాపనకు అడుగులు పడ్డాయి. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్య అందాలని.. తద్వారా ఇక్కడ ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని ఎంపీ, కలెక్టర్లు భావించడంతో రీజినల్‌ మెడికల్‌ సొసైటీ ఆధ్వర్యాన కళాశాల స్థాపనకు అప్పటి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేఎంసీ స్థాపించి అరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో కళాశాల స్థాపనకు జరిగిన కృషి, ఆ తర్వాత పరిణామాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

మెడికల్‌ సొసైటీ ఆధ్వర్యాన..
1959 జూలై 23న రీజినల్‌ మెడికల్‌ సొసైటీ ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్‌ కళాశాల ప్రారంభమైంది. అప్పట్లో కళాశాలను వడ్డేపల్లిలోని పింగిళి కళాశాల ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ కళాశాల నిర్వహణ కోసం కొనసాగుతున్న సొసైటీకి టీ.ఎస్‌.మూర్తి ఉపా«ధ్యక్షుడిగా, యతి రాజారావు మొదటి కార్యదర్శిగా కొనసాగారు. ఈ ఇక సొసైటీ నిర్వహణ మాత్రం ప్రజాప్రతినిధులు, యూనివర్సిటీ అధికారులు, పౌరుల చేతిలో కొనసాగింది. ఈ  కళాశాల నిర్వహణకు అప్పటి ఏపీ ముఖ్యమంత్రి సంజీవరెడ్డి హయాంలో అనుమతులు లభించగా కేంద్ర ఆరోగ్య మంత్రి పి.కరుమకర్‌ విచ్చేసి కళాశాలను ప్రారంభించారు. అప్పట్లో కేఎంసీ 50 సీట్లతో ప్రారం భమై ప్రస్తుతం 200 సీట్లతో కొనసాగుతోంది.

1961లో ప్రస్తుత ప్రాంగణానికి...
1959లో పింగిళి కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన కేఎంసీని 1961 ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంగణానికి మార్చారు. అయితే కళాశాల ప్రారంభోత్సవం మాత్రం 1962 అక్టోబర్‌ 10వ తేదీన అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి సుశీల్‌ నాయర్‌ చేతుల మీదుగా జరిగింది. ప్రస్తుతం 153 ఎకరాల్లో కొనసాగుతున్న కేఎంసీ మేజర్‌ కే.ఎన్‌.రావు నిర్మాణ ప్రణాళిక రూపొందించగా కళాశాల భవనాన్ని రూ.10.7 లక్షలతో 27 బ్లాక్‌లుగా 15 నెలల్లోనే నిర్మించి మెడికల్‌ విద్యార్థులకు అందించిన ఘనత అప్పటి అధికారులకే దక్కుతుంది. 


కేఎంసీ ప్రారంభించినప్పుడు తరగతులు నిర్వహించిన ‘పింగిళి’ భవనం, తొలినాళ్లలో కేఎంసీ  భవనాలు 

1977లో ప్రభుత్వ ఆధీనంలోకి...
1959వ సంవత్సరం నుంచి రీజినల్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగిన కేఎంసీ 1977 సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలగా గుర్తింపు సాధించింది. నాటి నుంచి కేఎంసీ అత్యంత ప్రతిష్టాత్మక కళాశాలగా కొనసాగుతూ వస్తుంది. ఎంబీబీఎస్‌ విద్యనుభ్యసించే విద్యార్థులకు మొట్టమొదటి ప్రవేశ పరీక్షను అమలుచేసింది కూడా కేఎంసీ కళాశాల అనే విషయాన్ని గొప్పగా చెబుతారు. 

మొదటి ప్రిన్సిపాల్‌గా రిటైర్డ్‌ డీఎంఈ ఖత్రి
కాకతీయ మెడికల్‌ కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా రిటైర్డ్‌ డీఎంఈ డాక్టర్‌ ఎల్‌.డీ.ఖత్రి నియమితులయ్యారు. అనంతరం రెండో ప్రిన్సిపాల్‌గా నియామకమైన టి.లక్ష్మీనారాయణ కళాశాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డారని చెబుతారు. ఆయన హయంలోనే కళాశాలలో అశించిన స్థాయిలో అభివృద్ధి జరిగిందని అప్పటి వైద్యులు తెలుపుతున్నారు. కళాశాల అభివృద్ధి కోసం లక్ష్మీనారాయణ అకడమిక్‌ కరిక్యులమ్‌ను రూపొందించడంతో పాటు ఎడ్యూకేటర్‌ కేంద్రంగా తీర్చిదిద్దారని చెబుతున్నారు. ఆయన చేసిన అభివృద్ధికి గుర్తింపుగా లక్ష్మీనారాయణను పయనీర్‌గా ప్రిన్సిపాల్‌ పిలుచుకుంటారు.

ప్రధాన భవనాన్ని ప్రారంభించిన ప్రధాని ఇందిర
దినదినాభివృద్ధి పథంలో నడుస్తున్న కేఎంసీలో నిర్మించిన నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవం 1966 జూలై 24వ జరగగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే కళాశాల వెనుక భాగంలో నిర్మించిన ఆడిటోరియంను అదే సంవత్సరంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శివరామప్రసాద్‌ ప్రారంభించారు. కళాశాలలో ప్రాంగణంలో విద్యార్థుల కోసం నిర్మించిన క్వార్టర్లు మాత్రం ఆంధ్రప్రదేశ్‌ హౌజింగ్‌ బోర్డ్‌  ఆధ్వర్యంలో కొనసాగేవి.

1977లో ప్రభుత్వ ఆధీనంలోకి...
1959వ సంవత్సరం నుంచి రీజినల్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగిన కేఎంసీ 1977 సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలగా గుర్తింపు సాధించింది. నాటి నుంచి కేఎంసీ అత్యంత ప్రతిష్టాత్మక కళాశాలగా కొనసాగుతూ వస్తుంది. ఎంబీబీఎస్‌ విద్యనుభ్యసించే విద్యార్థులకు మొట్టమొదటి ప్రవేశ పరీక్షను అమలుచేసింది కూడా కేఎంసీ కళాశాల అనే విషయాన్ని గొప్పగా చెబుతారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement