కాళేశ్వరం 19 ప్రాజెక్టుల సమ్మేళనం | Kaleshwaram is a compound of 19 projects | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం 19 ప్రాజెక్టుల సమ్మేళనం

Published Tue, Jun 26 2018 1:33 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

Kaleshwaram is a compound of 19 projects - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం 19 ప్రాజెక్టుల సమ్మేళనమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు చెప్పారు. 141 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని, ఇది పూర్తయితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును సోమవారం జాతీయ మీడియా ప్రతినిధుల బృందం సందర్శించింది. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ సమీపంలో జరుగుతున్న 8వ ప్యాకేజీ పనులు, అండర్‌ టన్నెల్, సర్జిపూల్‌లను పరిశీలించింది. సర్జిపూల్‌ పనులను చూసి ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అనంతరం లక్ష్మీపూర్‌ వద్ద క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రాజెక్టు గురించి జాతీయ మీడియా ప్రతినిధులకు వివరించారు. దేశంలో విదర్భ తర్వాత అత్యధిక ఆత్మహత్యలు జరిగేవి తెలంగాణలోనేనని, సీఎం కేసీఆర్‌ సోషల్‌ ఇంజనీరుగా మారి వ్యాప్కోస్‌ సంస్థ ద్వారా సర్వే చేయించి ఈ బృహత్తర ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని చెప్పారు. గోదావరి నది ఒడ్డున ఉన్న శివాలయం పేరిట కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నామని, మేడిగడ్డ ఈ ప్రాజెక్టులో తొలి బ్యారేజీ అని, ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. గోదావరి, ప్రాణహిత వల్ల మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువ ఉంటుందని, ఇదే విషయాన్ని సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్‌ సంస్థలు సర్వేలు చేసి చెప్పాయన్నారు. అందువల్లే తమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీ నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. 

45 రోజుల్లో తొలి ఫలితం 
జాతీయ మీడియా ప్రతినిధులతో ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి హరీష్‌రావు వారు వెళ్లిన తర్వాత రాత్రి వరకు ప్రాజెక్టు ఇంజనీర్లతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం రెండో బ్యారేజీ 66 గేట్లకుగాను 23 గేట్లు పూర్తి కాగా, మిగతా పనుల వేగం పెంచాలని సూచించారు. డబుల్‌ లేన్‌ రోడ్‌ బ్రిడ్జి కూడా నిర్మించి ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చూడాలన్నారు. జూలై 31 నాటికి బ్యారేజీ పనులు పూర్తి చేసి, మరో 45 రోజుల్లో తొలి ఫలితం ప్రజలకు అందేలా చూడాలని సూచించారు.

1,832 కి.మీ. కాల్వలు.. 203 కి.మీ.లు అండర్‌ టన్నెల్స్‌
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,832 కి.మీ. డిస్ట్రిబ్యూషన్‌ కాల్వలు నిర్మిస్తున్నామని, ఇందులో 1,531 కి.మీ. మేర గ్రావిటీ కాల్వలు కాగా, 203 కి.మీ. అండర్‌ టన్నెల్‌ నిర్మిస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. 141 టీఎంసీల నీటి వినియోగానికి 19 రిజర్వాయర్లతోపాటు 22 లిఫ్టులు, 21 పంప్‌హౌస్‌లను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఇందుకు 139 మెగావాట్ల పంపులు వాడుతున్నామని, ఇది ప్రపంచంలోనే ఓ రికార్డు అని పేర్కొన్నారు. మహాయజ్ఞంలా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 6 వేల మంది ఇంజనీర్లు, 25 వేల మంది కూలీలను వినియోగిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 4,20,95,000 సిమెంటు బస్తాలకు గానూ 3 కోట్ల 10 లక్షల సిమెంటు బస్తాలు వినియోగించామన్నారు.

మేడిగడ్డ బ్యారేజీలో 85 గేట్లు ఏర్పాటు చేస్తున్నామని, 60 శాతం పనులు పూర్తయ్యాయని, తొలి పంప్‌హౌస్‌ మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్నామని తెలిపారు. మేడిగడ్డ 2019 జనవరి 1 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ నదిలో 3 బ్యారేజీల వద్ద 36 టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చని, దీంతో గోదావరి పునరుజ్జీవనం అవుతుందని చెప్పారు. ఈ బ్యారేజీ వల్ల 110 కిలోమీటర్ల బ్యాక్‌ వాటర్‌తో గోదావరిలో 365 రోజులపాటు నీరు నిల్వ ఉంటుందని, దీనివల్ల టూరిజం, ఫిషింగ్, వాటర్‌ స్పోర్ట్స్‌ వంటి కార్యకలాపాలు సాగనున్నాయని వివరించారు. అన్నారం బ్యారేజీ పనులు కూడా 90 శాతం పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ నల్ల వెంకటేశ్వర్లు, అడ్వయిజర్‌ పెంటారెడ్డి, ఎస్‌ఈ వెంకట్రాములు, ఈఈ నూనె శ్రీధర్, జాతీయ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement