శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన జి.వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమంలో మంత్రి హరీశ్, వినోద్, వివేక్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దు కున్న అప్పటి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు దివంగత కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) చలవేనని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గత ప్రభుత్వం నీళ్లు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి లభ్యత ఉన్న మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు రీడిజైన్ చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి కాబోతోందని, కాకాకు అదే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసై టీలో వెంకటస్వామి తృతీయ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ, ‘కాకా అన్ని పదవులు అధిష్టించారు.
అహం భావం లేకుండా సామాన్య ప్రజలు, కార్మికులతోనే ఆయన నిరాడంబరంగా తిరిగారు. శక్తివంతమైన కార్పొరేట్ లాబీయింగ్‌ను తట్టుకొని కార్మికులకు పెన్షన్ పథకం అమలు జరిగేలా పోరాడారు’ అని వివరించారు. కాకాను అత్యున్నతంగా గౌరవించుకో వాలని ట్యాంక్‌బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కాకా కుమారులు వివేక్, వినోద్ కీలక సందర్భాల్లో చక్రం తిప్పారని, తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా వివేక్ తెర వెనుక ఎంతో క్రియాశీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తులో కాకా కీలక పాత్ర వహించారన్నారు. తెలంగాణ సమాజం వెంకటస్వామికి ఎంతో రుణపడి ఉందని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. సమాజం మేలు కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వెంకట స్వామి ముందుచూపుతో అంబేడ్కర్ సొసైటీని స్థాపించారని కొనియాడారు. కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment