
కామారెడ్డి టు బంగ్లాదేశ్
కామారెడ్డి: కామారెడ్డి పట్టణం మెడికల్ వ్యాపారంలో తెలంగాణలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ఇదే సమయంలో అక్రమ దందాలకు అడ్డాగా మారుతోంది. మత్తును కూడా కలిగించే కాఫ్‌సిరప్ (పెన్సిడిల్) పెద్ద ఎత్తున బంగ్లాదేశ్‌కు అక్రమ మార్గంలో తరలుతుం డగా నిఘా వర్గాలు పట్టుకున్నట్లు వచ్చిన వార్తలు ఇందుకు నిదర్శనం.
కామారెడ్డిలో 40 వరకు పెద్ద ఏజెన్సీలు, మరో 40 వరకు చిన్న ఏజెన్సీలు ఉన్నాయి. నాలుగైదు ఏజెన్సీలలో ప్రతి నెలా రూ. కోటిన్నర నుం చి రూ. రెండు కోట్ల వరకు వ్యాపారం సాగుతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ఏజెన్సీలలో రూ. 50 లక్షల వరకు, మరికొన్నిటిలో రూ. 20 లక్షల వరకు వ్యాపారం సాగుతున్నట్టు సమాచారం. మొత్తం మీద కామారెడ్డిలో ఏడాది కాలంలో రూ. 200 కోట్ల వ్యాపారం సాగుతున్నట్టు తెలుస్తోంది.
గతంలోనూ ఆరోపణలు
కామారెడ్డిలో గతంలో నకిలీ మందుల విక్రయాలు కూడా జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఇక్కడి వ్యా పారుల మధ్య ఏర్పడిన విభేదాలు పోలీసు కేసులు, కోర్టు వరకూ వెళ్లాయి. మెడికల్ వ్యాపారంలో రాణిం చిన ఇక్కడి వ్యాపారులు ఔషధ నియంత్రణ అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్పి వారి నోరు మూయిస్తారనే ప్రచారం ఉంది. దీంతో ఏ అధికారి కూడా దుకాణాల వద్దకు వెళ్లే ధైర్యం చేసే పరిస్థితి ఉం డదు. రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో వ్యాపారులు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవాల్సిందేనని పలువురు పేర్కొంటున్నారు. పెన్సిడిల్ సిరప్ దందా అంతర్జాతీయ స్మగ్లర్‌ల కనుసన్నలలో నడుస్తోంది.
బంగ్లాదేశ్ యువతను మత్తులో దింపడానికి వాడుతున్న ఈ డ్రగ్‌ను త్రిపుర మీదుగా తరలిస్తున్నారు. మందు సీసాలను బంగ్లా సరిహద్దు వరకు ఇతర సరుకులతోపాటు ట్రక్కులలో తరలిస్తున్న స్మగ్లర్లు అక్కడినుంచి వివిధ మార్గాల ద్వారా బోర్డర్ దాటిస్తారు. తప్పుడు ధ్రువపత్రాలు ఇన్‌వాయిస్‌లు తయారు చేసి రవాణాలో ఎటువంటి ఇబ్బం దులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. భారత్‌లో దాని వాడకం తక్కువగా ఉండడం, ధర కూడా తక్కువగా ఉండడంతో జౌషధ వ్యాపారులు బోర్డర్ దాటిం చేందుకు నెట్ వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
బంగ్లాదేశ్‌లో యువత పెన్సిడిల్ మత్తుకు అలవాటు పడుతుండడంతో యునెటైడ్ నేషన్స్ డ్రగ్స్ క్రైమ్ విభాగం ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. పెన్సిడిల్‌లో ఉండే హైడ్రోక్లోరైడ్ ఎఫిడ్రెన్. ప్రోమోథోజైన్‌ల సమ్మేళనం మత్తు కలిగిస్తుందని ఫార్మసిస్టులు చెబుతున్నారు. ఒక 50 మిల్లీ లీటర్ల పెన్సిడిల్ బాటిల్, మద్యం ఫుల్‌బాటిల్‌తో సమానంగా మత్తును కలి గిస్తుందని చెబుతున్నారు. దాని ఓవర్ డోసేజ్‌తో ఇత ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏజెన్సీలకు చేరకుండానే
అక్రమ లాభాలకు మరిగిన కొందరు మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులు పెన్సిడిల్‌ను రిటైలర్‌లకు విక్రయించినట్టు ఇన్వాయిసులు తయారు చేస్తున్నారు. ఫా ర్మాకంపెనీ నుంచి ఏజెన్సీలకు తీసుకురాకుండా అటునుంచి అటే ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దాంతో ఇక్కడ అవసరమైన మందు మార్కెట్‌లో దొరుకకపోగా బంగ్లాదేశ్ యువతను మత్తులో దించడానికి ఉపయోగపడుతోంది. కామారెడ్డి చెందిన ఓ మెడికల్ ఏజెన్సీ ఆరు నెలల కాలంలో రెండు లక్షలకు పైగా పెన్సిడిల్ బాటిళ్లను కొను గో లు చేసినట్టు అధికారుల విచారణలో తేలిందంటే వ్యాపారం ఎంత జోరుగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏయే మందుల దుకాణాల పేర్లపై బిల్లులు తయారు చేశారన్న అం శంపై ఔషధ నియంత్రం శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.
దండిగా లాభాలు
ఒక 50 ఎంఎల్ పెన్సిడిల్ బాటిల్ ఎమ్మార్పీ 51.50 రూపాయలు మాత్రమే ఉంది. హోల్‌సేల్ ఏజెన్సీలతో పాటు, రిటైలర్ వ్యాపారులకూ ఈ బాటిల్ అమ్మడం ద్వారా 20 శాతం నుంచి 30 శాతం వరకు లాభం వస్తుంది. మత్తుకోసం ఎక్కువగా వాడే బంగ్లాదేశ్‌కు తరలిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయన్న అత్యాశతో కొందరు వ్యాపారులు అక్రమంగా రవాణా చేయడం మొదలెట్టారు. కొంత కాలంగా అంతర్జాతీయ స్మగ్లర్లతో కుమ్మక్కై వీటిని సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనాలు ప్రచురిం చింది. కాగా దగ్గుమందు బాటిళ్లను బంగ్లా బార్డర్ తరలించి విక్రయిస్తే సుమారు రెండు నుంచి మూడు వందల రూపాయల ధర పలుకుతుందని తెలుస్తోం ది. వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో చాలా కాలంగా దందా నిరాటంకంగా సాగు తోంది.