'కంది' పోతున్న రైతులు
Published Thu, Feb 25 2016 10:51 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
మార్కెట్‌యార్డులో పేరుకుపోయిన నిల్వలు
రోజుల తరబడి నిరీక్షణ..
ఆలస్యంగా పంట దిగుబడి..
రేపటి నుంచి కందుల కొనుగోళ్లు బంద్
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పంట దిగుబడి కోసం రేయింబవళ్లు కష్టపడిన రైతులు చేతికొచ్చిన పంటను విక్రయించాలన్నా మార్కెట్‌యూర్డులో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ‘మార్కెట్‌యూర్డులోనే పంట దిగుబడికి గిట్టుబాటు ధర లభిస్తుంది.. దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు.. ప్రభుత్వ రంగ సంస్థలే రోజువారీగా కొనుగోలు చేస్తారు. అమ్మిన వాటికి 48 గంటల్లో చెల్లింపులు చేస్తాం..’ అంటూ చెబుతున్న ప్రభుత్వం, అధికారులు ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్‌యూర్డుకు కందులను తీసుకొచ్చిన రైతులు కొనుగోళ్లు.. డబ్బుల చెల్లింపులు లేక రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 46 వేల హెక్టార్లలో కంది పంట సాగు చేశారు. జిల్లాలో భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో రెండు నెలల క్రితం కొనుగోళ్లు ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆలస్యంగా సాగు చేయగా ఇప్పుడిప్పుడే దిగుబడి వస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలకు విక్రయిస్తే గిట్టుబాటు ధర లభిస్తుందనే ఆశతో మార్కెట్‌కు భారీగా కందులు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్‌లో రెండు మూడు రోజులుగా కొనుగోళ్లు లేకపోవడంతో రైతులు యూర్డులోనే పడిగాపులు కాస్తున్నారు. తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు లేక.. తీసుకొచ్చిన ధాన్యాన్ని తీసుకెళ్లలేక అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో పదిహేను రోజుల క్రితం ఆరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా కొద్ది రోజులుగా రెండు చోట్ల కొనుగోళ్లు నిలిపి వేశారు. దీంతో భారీగా జిల్లా కేంద్రంలోని మార్కెట్‌కే తరలిస్తున్నారు. కందులకు సరిపడా గన్ని బ్యాగులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం నుంచి కొనుగోళ్లు నిలిపి వేస్తున్నట్లు ఆదిలాబాద్ మార్కెట్ ఉన్నత కార్యదర్శి అన్నెల అడెల్లు బుధవారం ప్రకటించారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. యార్డులో నాలుగు ప్లాట్‌ఫాంలు నిండిపోగా.. యార్డులోని ఖాళీ స్థలం కూడా కందుల కుప్పలు పేరుకపోయాయి. సరిపడా గన్ని బ్యాగులు ముందుస్తుగా తెప్పించక పోవడం వల్లే నిల్వలు పేరుకుపోయాయి.
దళారులకే పెద్దపీట
కంది పప్పుకు ఉన్న డిమాండ్‌తో ఈ ఏడాది ప్రభుత్వ రంగ సంస్థలే కందులను మద్దతు ధర కంటే రూ.2 వేల నుంచి రూ.4వేలు వరకు అదనంగా చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ధర ఎక్కువగా ఉండడంతో రైతులు పెద్ద ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్‌కే విక్రయిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 86,864 క్వింటాళ్ల కందులను కొనుగో లు చేశారు. ఏటా వ్యాపారులు జిమ్మిక్కులతో మద్దతు ధర కంటే తక్కువగా చెల్లిస్తూ కొనుగోలు చేయగా.. ఈ ఏడాది ప్రభుత్వ రంగ సం స్థలు ముందుకు రావడం వ్యాపారులకు మిం గుడు పడడం లేదు. దీంతో కొన్ని రోజులుగా వ్యాపారులు అధికారులను తమ జిమ్మిక్కులకు అనుగుణంగా మలుచుకుంటున్నారనే ఆరోపణలున్నారు. రైతులు తీసుకొచ్చిన కందులను కోనడంలో ఆలస్యం చేస్తూ.. దళారులు తెచ్చిన కందులకు గంటల్లోనే టోకెన్లు, గన్ని సంచులు అందజేసి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఎఫ్‌సీఐ క్వింటాల్‌కు రూ.8000 చెల్లిస్తుండగా.. దళారులు మార్కె ట్ యార్డులోనే క్వింటాల్‌కు రూ.7 వేల నుంచి రూ.7500 వరకు చెల్లిస్తూ.. వెంటనే డబ్బులు చెల్లిస్తున్నారు. రైతుల దృష్టిని ఆ వైపు మరల్చేలా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నారు. ఈ కారణంగా రైతులు క్వింటాల్‌కు రూ. 500 నుంచి 1000 వరకు నష్టపోతున్నారు. ఎప్పటికప్పడు కొనుగోళ్లు చేయాల్సిన అధికారులు ఆలస్యం చేస్తుండడం వ్యాపారుల వ్యూహంలో భాగమేనని రైతులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు చేయూలని రైతులు కోరుతున్నారు.
నిన్న పొద్దున వచ్చినా..
అందుబాటులో మార్కెట్‌యార్డు లేకపోవడంతో ధర ఎక్కువగా లభిస్తుందని ఆదిలాబాద్ మార్కెట్‌కు కందులను తీసుకొని వచ్చిన. గన్ని సంచులు లేవని నిన్నటి నుంచి కొనలేదు. రెండు రోజులు ఇక్కడ ఉండడంతో మా ఇంటోళ్లు ఆందోళన చెందుతున్నారు. - పున్నం బజ్జన్న,
గ్రామం : లక్సెట్టిపేట, మం : ఉట్నూర్
సంచులు లేవని ఆలస్యం..
కందుల కుప్పకాడికి ఎవరు వచ్చి అడిగినోల్లే లేరు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏ అధికారి రాలేదు. ముందుగా దళారులయే కొంటున్నారు. రైతుల తె చ్చినవి సంచులు లేవని ఆలస్యం చేస్తున్నరు. రోజుల తరబడి ఉంచకుండా వెంటనే కొనుగోళ్లు చేయాలి
- రామ్‌రెడ్డి, గ్రామం : కోడద్, మం : తాంసి
తిండి లేకుండా యార్డులోనే..
పంట చేను వద్ద రాత్రనకా పగలనకా కష్టపడితే.. పంట అమ్ముకోవాలన్న మార్కెట్‌యార్డులో రోజుల కొద్దీ రాత్రీ, పగలు తేడా లేకుండా తిండి తిప్పలు లేకుండా ఉండాల్సి వస్తంది. ధర ఎక్కువగా వస్తుందని 60 కిలోమీటర్ల దూరం నుంచి కందులను తీసుకొచ్చిన. కొనకపోవడంతో ఇంటికి తీసుకెళ్లే కిరాయి ఎక్కువగా అవుతుందని యార్డులనే నిన్నటి నుంచి ఉంటున్న. వెంటనే కొనుగోలు చేయాలి.
- గంగరాం, గ్రామం : అల్లిగూడ, మం : ఉట్నూర్
Advertisement
Advertisement