- కాంగ్రెస్‌లో చేరిన గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తుందనడానికి ఒక బీసీకి టీపీసీసీ చీఫ్ పదవి అప్పగించడమే రుజువని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.
గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ తన అనుచరులు, పోరాట సమితి జిల్లాల అధ్యక్షులతో కలసి గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో పొన్నాల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 87 శాతం మంది బీసీలు ఉన్నారని, జనాభా దామాషా పద్ధతిలో పార్టీ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు.
గతంలో మాదిరిగా బీసీలు అవకాశాల కోసం ఎదురు చూడడం లేదని, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎదుగుతున్నారని చెప్పారు. గొల్లకుర్మ హక్కుల కోసం జరిగే పోరాటాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. గోసుల శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న గొల్ల కుర్మల హక్కులను కాపాడేందుకే కాంగ్రెస్‌లో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ జి.వివేక్ తదితరులు పాల్గొన్నారు.