
గోదావరిఖనిలోని జీఎం కాలనీ ప్రధాన రోడ్డును మూసివేసిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాను కరోనా భయం వీడడం లేదు. ఇండోనేసియన్లతో మొదలైన కరోనా పాజిటివ్ కేసులు ఆగుతున్నాయనుకునేలోపే... ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారితో పెరుగుతున్నాయి. ఇండోనేసియన్ల ద్వారా కరీంనగర్ జిల్లాకే పరిమితమైన కరోనా పాజిటివ్ కేసులు ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వారి వివరాలు తెలిసిన తరువాత పెరగడం మొదలైంది. ఉమ్మడి జిల్లా నుంచి తబ్లిగీ జమాత్ సమావేశానికి 59 మంది వెళ్లొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరందరిని క్వారంటైన్‌కు తరలించగా ఇప్పటికి హుజూరాబాద్‌లో ఇద్దరికి, కరీంనగర్‌లో ఒకరికి, జగిత్యాలలో ముగ్గురికి కరోనా సోకింది. పెద్దపల్లిలో మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారితో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా, వీరు ప్రయాణించిన రైలులో వచ్చిన మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. తాజాగా హుజూరాబాద్‌లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ద్వారా మరొకరికి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మర్కజ్ వెళ్లొచ్చిన వారి నుంచి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా రెండో దశ కరోనా వ్యాపించింది. పెద్దపల్లిలో ఆదివారం నిర్ధారణ అయిన వ్యక్తికి సైతం ప్రైమరీ కాంటాక్ట్ ద్వారానే వ్యాధి సోకిందని అధికారులు నిర్ధారించారు.
ఇండోనేషియన్ల ద్వారా సోకింది నలుగురికే..
మార్చి 14న కరీంనగర్‌కు వచ్చి 16 వరకు బస చేసి హైదరాబాద్ క్వారంటైన్‌కు తరలి వెళ్లిన పది మంది ఇండోనేసియన్ల ద్వారా ఇద్దరికి, వారిలో ఒకరి ద్వారా అతని కుటుంబంలోని మరో ఇద్దరికి కరోనా ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా సోకింది. ఇప్పటి వరకు ఇండోనేసియన్ల ద్వారా వ్యాధి సోకింది నలుగురికే. రెండవ ఫేజ్‌లో నిజాముద్దీన్ ఘటన భయభ్రాంతులకు గురి చేస్తుంది. కరీంనగర్ జిల్లా నుంచి మర్కజ్‌కు వెళ్లొచ్చిన 19 మందిలో ముగ్గురికి సోకగా, వారిలో ఒకరు కరీంనగర్ అయితే, ఇద్దరు హుజూరాబాద్ వాళ్లు. హుజూరాబాద్‌లో పాజిటివ్ వ్యక్తి ద్వారా మరో వ్యక్తికి సోకడంతో జిల్లా మొత్తంలో 18 మందికి సోకినట్లయింది. కాగా వీరికి మళ్లీ పరీక్షలు జరపగా, 13 మందికి నెగెటివ్ అని తేలింది. వీరిలో పది మంది ఇండోనేసియన్లు కూడా ఉండడం గమనార్హం. మరో ఐదుగురు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కాకుండా పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున పాజిటివ్‌తో బాధ పడుతున్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పాజిటిక్ కేసులు 23కు చేరాయి.
భయపెడుతున్న మర్కజ్ యాత్రికులు
నిజాముద్దీన్ మర్కజ్ సమావేశానికి వెళ్లి వచ్చిన ఉమ్మడి జిల్లాకు చెందిన 59 మంది ద్వారా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతాయని అధికార యంత్రా ంగం ఆందోళన చెందుతోంది. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి ద్వారా ఏడుగురుకి, వీరిలో ఒకరి ద్వారా çసోమవారం హుజూరాబాద్ వ్యక్తికి పాజిటివ్ రావడంతో సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యాధికా రులు భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన వారు జిల్లాలో ఎంత మందిని కలిశారనే విషయంలో ఆందోళన చెందుతున్నారు. ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు చేసిన వారు, వారి కుటు ంబాల పరిస్థితి ఏంటనే విషయం అర్థం కావడం లేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో కరోనా సోకిన వారి నుంచి కేవలం వారి కుటుంబసభ్యులకే తప్ప వేరే వ్యక్తులకు ట్రాన్స్‌మిట్ కావడం లేదని తెలుస్తోంది.
ప్రజల సహకారంతోనే అడ్డుకట్ట
ఇండోనేషియన్లకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన 18వ తేదీ తరువాత నుంచి కరీంనగర్ ప్రజలు, అధికారులు సంఘీభావంతో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 18 పాజిటివ్ కేసులు రాగా, వాటిలో రెండోసారి పరీక్షల్లో 13 మందికి నెగిటివ్ వచ్చింది. వారిని డిశ్చార్జి చేశారు కూడా. ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌గా ఉంది. మరో ఇద్దరికి సంబంధించిన ఫలితాలు రావలసి ఉంది. మర్కజ్ వెళ్లొచ్చిన వారందరినీ క్వారంటైన్ చేశాం. వారి కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్, హోం క్వారంటైన్‌లలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.– గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి