కరీంనగర్ సర్కిల్ కార్యాలయం
కొత్తపల్లి(కరీంనగర్) : విద్యుత్‌శాఖలో బదిలీల సందడి నెలకొంది. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్‌పీడీసీఎల్) ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి సంస్థ ఇదివరకే మార్గదర్శకాలను జారీ చేసింది. తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చా క రెండోసారి విద్యుత్‌శాఖలో బదిలీలు చేపడుతోంది. మూడేళ్ల క్రితం వంద శాతం ఉద్యోగులు, సిబ్బంది బదిలీలు చేపట్టిన ప్రభుత్వం, ఈసారి 40 శాతం మాత్రమే బదిలీ చేయాలని నిర్ణయించింది. జూన్ 30వ తేదీ వరకు మూడే ళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులను బదిలీకి అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ బదిలీలన్నీ పాత సర్కిల్ పరిధిలో జరగనున్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు మా త్రం సంస్థ పరిధిలో చేపట్టనున్నారు. బదిలీ చేయాల్సిన ఉద్యోగుల జాబితాను ఇదివరకే ప్రకటించిన ఉన్నతాధికారులు అభ్యంతరాల ను సైతం స్వీకరించారు. ఈ నెల 15వ తేదీన ఉద్యోగుల బదిలీలను ప్రకటించనున్నారు. బదిలీ అయిన ఉద్యోగులు, సిబ్బంది 20లోగా రిలీవ్ అయి కేటాయించిన చోట బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
పాత సర్కిల్ పరిధిలోనే బదిలీలు..
పాత కరీంనగర్ సర్కిల్ పరిధిలోనే కార్యాలయ సిబ్బంది, ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగం (ఎగ్జిక్యూటివ్)కు సంబంధించిన అధికా రులను మాత్రం కంపెనీ పరిధిలో చేపట్టనున్నా రు. పరిపాలన సౌలభ్యం కోసం ఇటీవల నూతన జిల్లాకో సర్కిల్ ఆఫీసును ఏర్పాటు చేసిన ప్రభుత్వం, పరిపాలనంతా పాత సర్కిల్ కేంద్రంగానే కొనసాగుతోంది. ఇప్పుడు కూడా పాత సర్కిల్ పరిధిలోనే బదిలీల ప్రక్రియ చేపడుతోంది. ఉమ్మడి కరీంనగర్ సర్కిల్‌ను జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ సర్కిళ్లుగా విభజించిన విషయం విదితమే. అయితే.. పూర్తిస్థాయిలో సర్కిళ్ల విభజన అనంతరం బదిలీలు చేపడితే బాగుండన్న అభిప్రాయాలు సైతం ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి. సర్కిళ్లు ఏర్పాటు చేసినా సరిపడా సిబ్బంది లేక నామమాత్రంగా కొనసాగుతున్నా యి. ఆఫీసు సబార్డినేట్, ఫోర్‌మెన్, రికార్డ్ అసిస్టెంట్, స్వీపర్లు, వాచ్‌మెన్, జేఏఓలు, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సబ్ ఇంజినీర్ పోస్టులను సర్కిల్ పరిధిలో బదిలీలు చేపడుతుండగా.. ఏఈ, ఎస్‌ఈ, డీఈ, అకౌంట్స్ ఆఫీసర్లకు సంబంధించి బదిలీల ప్రక్రియ వరంగల్ కేంద్రంగా కంపెనీ పరిధిలో జరగనున్నాయి.
ఉద్యోగుల లిస్టు ప్రదర్శన..
ఉమ్మడి కరీంనగర్ సర్కిల్ పరిధిలో 2,013 మంది వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ఉండగా.. ఇందులో మూడేళ్లు నిండిన 203 మంది కి బదిలీకి అర్హులుగా నిర్ణయించారు. ఆఫీసు సబార్డినేట్ 21, ఫోర్‌మెన్ 8, రికార్డ్ అసిస్టెంట్ 7, స్వీపర్లు 3, వాచ్‌మెన్ 2, జేఏవోలు 9, జూనియర్ అసిస్టెంట్ 48, సీనియర్ అసిస్టెంట్ 24, సబ్ ఇంజినీర్లు 19 మందితో కూడిన లిస్టును కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో నోటీస్ బోర్డుపై ప్రదర్శించారు. వీరి వద్ద నుంచి అభ్యంతరాలను సైతం ఉన్నతాధికారులు స్వీకరించారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి కంపెనీ పరిధిలో ప్రక్రియ జరగనున్నందునా టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ వరంగల్ కేంద్రంగా బదిలీల లిస్ట్ వెలువడనుంది.
చోటు కోసం పైరవీలు..
బదిలీ అవుతున్న వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులు కోరుకున్న చోటు కోసం పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం. ట్రేడ్ యూనియన్ల మద్దతుతో కార్మికులు, ఉన్నతాధికారుల మద్దతు కోసం కార్యాలయ సిబ్బంది, కంపెనీ పరిధిలో జరిగే ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం ఖాళీలుంటే పోస్టింగ్ సులువుగా దొరికే అవకాశం ఉంది. కానీ.. ఒకే చోటుకు పోటీ నెలకొన్న పరిస్థితుల్లో పైరవీలు చేపడుతున్నారు.
కంపెనీ మార్గదర్శకాల మేరకు.. – కె.మాధవరావు, ఎస్‌ఈ, కరీంనగర్ సర్కిల్
టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ కంపెనీ మార్గదర్శకాల మేరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. మూడే ళ్లు నిండిన సర్కిల్ పరిధిలోని 40 శాతం మంది ఉద్యోగులకు బదిలీలు అనివార్యం అయ్యాయి. బదిలీల లిస్టులో ఉన్న సిబ్బంది, ఉద్యోగుల అభ్యంతరాలు ఇదివరకే స్వీకరించాం. ఆప్షన్ పెట్టుకుంటే తదనుగుణంగా పరిశీలించి పోస్టింగ్ కేటాయిస్తాం. ఈ నెల 15వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ పూర్తవుతుంది. 20వ తేదీలోగా పోస్టింగ్ ప్రదేశాల్లో జాయిన్ కావల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment