
కరీంనగర్ స్పోర్ట్స్: వారంతా కూలీల బిడ్డలు. ఇల్లుగడవడమే కష్టంగా ఉన్న తరుణంలో వారి తల్లిదండ్రులు తమ పిల్లలను బాక్సర్‌లుగా చూడాలనుకున్నారు. మేరీకాం లాంటి మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్నారు.దేశానికి ఒలింపిక్ పతకం తేవాలనుకున్నారు.ప్రపంచానికి ఇండియా పంచ్ పంచ్ చూపించాలనుకుంటున్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో రెండ్రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి నేపథ్యంపై కథనం..
కూలీబిడ్డ కాంస్య పతక విజేత
వరంగల్ జిల్లా హన్మకొండకు సీహెచ్.దివ్య బాక్సింగ్‌లో దిట్ట. నాన్న కూలీ చేస్తుండగా అమ్మ గృహిణి. ఇప్పటి వరకు ఐదుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. గత సంవత్సరం పాఠశాలల జాతీయక్రీడా పోటీల్లో అద్వితీయ పోరాటపటిమ కనబరిచి కాంస్య పతకం సాధించింది. మేరీకామ్ స్ఫూర్తితో ఒలింపిక్‌లాంటి మెగాపోటీల్లో ప్రాతినిథ్యం వహించాలనుకుంటోంది.
ఆటోడ్రైవర్ కొడుకు
భాగ్యనగరంలో బాక్సింగ్‌లో రాణించి ఇండియన్ బాక్సర్‌గా పేరుసంపాదించడమే తన ఆశయమంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన వేణు. నాన్న సిటీలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా తల్లి గృహిణి. నాలుగుసార్లు జాతీయస్థాయితో పాటు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియాలో పాల్గొని సత్తా చాడాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు.
ఖేలో ఇండియాలో కూలీకొడుకు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గణేష్ బాక్సింగ్‌లో దిట్ట. మంథనిలోని గురుకుల కళాశాలలో చదువుతున్నాడు. ఇప్పటి వరకు 8సార్లు సత్తా చాటాడు. తండ్రి కూలీ పనిచేస్తుండగా తల్లి గృహిణి. గతేడాది జరిగిన ఖేలో ఇండియా పోటీల్లో కరీంనగర్ నుంచి సత్తాచాటాడు. గణేష్ భవిష్యత్‌లో ఐపీఎస్ అధికారిగా సేవలందించాలనుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment