మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్న ఆర్యవైశ్య ప్రముఖులు చిట్టుమల్ల శ్రీనివాస్, యాద అంజయ్య, ఎలగందుల మునీందర్, తదితరులు
కరీంనగర్ : అలుపెరుగని పోరాటం చేసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సమగ్రాభివృద్ధి చేయడంలో ప్రజలంతా భాగస్వాములు కావాల ని, బంగారు తెలంగాణ అభివృద్ధికి బాటలు వేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్‌లో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు చిట్టుమల్ల శ్రీనివాస్, నాగమల్ల మధుసూదన్, ఎలగందుల మునీందర్, యాద అంజయ్య, నగునూరి రాజేందర్, ఏవీ మల్లిఖా ర్జున్, మంచాల సుధాకర్‌తోపాటు 2 వేల మంది ఆర్యవైశ్య ప్రముఖులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్యవైశ్య నేతలకు, కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు తటస్థంగా ఉంటూ వ్యాపారం చేసుకునే ఆర్యవైశ్యులు టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకోవడం శుభసూచకమని, రానున్న 2019 ఎన్నికల ఫలితాల విజయానికి దిక్సూచిగా మిగిలిపోతుందని అన్నారు. కరీంనగర్ జిల్లా అంటే టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు అత్యంత అభిమానమని, తొలినాళ్లలో సింహగర్జన బహిరంగ సభ మొదలుకొని నేటి వరకు టీఆర్‌ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ తెలంగాణ ఆవశ్యకతను ఢిల్లీ పెద్దలకు చాటిచెప్పిన ఘనత కరీంనగర్ జిల్లా ప్రజలదని అన్నారు.
2006 ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పునర్జన్మనిచ్చిన ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయా పార్టీలు టీఆర్‌ఎస్‌కు ఉద్యమాలు, ధర్నాలు చేయడం తెలుసు, పరిపాలన మీతో సాధ్యం కాదని హేళన చేశారని గుర్తు చేశారు. ‘కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే చీకటిగా మారుతుందని, తెలంగాణ వారికి తెలివి లేదన్న’ వారి మాటలను పటాపంచలు చేస్తూ నాలుగేళ్లల్లోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతూ గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టిగా తయారు చేస్తూ, ఐటీ రంగాన్ని అభివృద్ధి పరుస్తూ ఇతర రాష్ట్రాలు నివ్వెరపోయే విధంగా పరిపాలన సాగుతుందని అన్నారు.
అగ్రకులాల పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని స్పష్టం చేశారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇదే స్ఫూర్తిని అన్ని జిల్లాల్లో కొనసాగించి టీఆర్‌ఎస్‌కు మరింత బలం చేకూర్చాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో కిరాణ అసోసియేషన్ భవన్, ట్రేడర్స్ భవన నిర్మాణం, వైశ్య హాస్టల్, సంఘ భవనం కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని హామీలను అమలు చేసే దిశగా సమష్టిగా బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేసి అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని జీవించే విధంగా పాలన సాగించడమే టీఆర్‌ఎస్ లక్ష్యమని అన్నారు. గతంలో కరెంట్ కోతలతో రైస్‌మిల్లులు నడువక ఆర్యవైశ్యులు ఇబ్బందులు పడేవారని, తాజాగా కరెంట్‌కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని అన్నారు. ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవుతాయని, పంటలు పండుతాయని, రైస్‌మిల్లులకు పని ఎక్కువగా ఉండటమే కాకుండా వ్యాపార వాణిజ్య రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని భరోసా ఇచ్చారు. ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయని విధంగా ఆర్యవైశ్యుల్లో ఉన్న పేదలకు సైతం కళ్యాణలక్ష్మి, వృద్ధాప్య వితంతు పెన్షన్లు అందిస్తున్నామని వెల్లడించారు. పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులంతా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరి బాసటగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో భాగస్వాములైన సబ్బండ వర్ణాలు బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుండాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి తెలుసని, దశల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ఉండే ఆర్యవైశ్యులు టీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరడం శుభపరిణామని అన్నారు. కరీంనగర్ నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, కార్పొరేటర్లు వై.సునీల్‌రావు, బండారి వేణు, బోనాల శ్రీకాంత్, కంసాల శ్రీనివాస్, కన్న కృష్ణ, చల్ల హరిశంకర్, రావికంటి భాగ్యలక్ష్మి, గుర్రం పద్మారెడ్డితోపాటు టీఆర్‌ఎస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కేటీఆర్‌కు ఘన స్వాగతం..
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్‌కు విచ్చేసిన సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చిన్నారులు సెల్ఫీలు దిగి సందడి చేశారు. మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడం, ఆర్యవైశ్యులు అదే స్థాయిలో ఉండడంతో వేదికపైకి చేరుకునేందుకు తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని మంత్రిని వేదికపైకి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment