కాగ్ రిపోర్టుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం: కర్నె
సాక్షి, హైదరాబాద్: కాగ్ రిపోర్టుపై కాంగ్రెస్ నేతలు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని, ఆ రిపోర్టులు సాధారణ ప్రక్రియలో భాగమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీగా కాకుండా ఓ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్ మారిందని, ఆ పార్టీ నేతలు చెప్పేవన్నీ బోగస్ మాటలేనని విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలన్నీ టీఆర్‌ఎస్ నెరవేర్చిందని, ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
ఉగాది రోజున మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను కలిసినపుడు అనేక అంశాలు చర్చకు వచ్చాయన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా వెనుకబడిన పాలమూరును అభివృద్ధి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చర్చించారన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మాత్రం ఈ భేటీపై చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్ చేసిన సూచనలను సీఎం ఆమోదించారని, పాలమూరులో 15 లక్షల ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాలమూరు పథకం మొదటి లిఫ్ట్ రీడిజైన్‌ను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే వంశీచంద్.. ఆ మాటను సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చెప్పించగలరా అని సవాలు చేశారు.