కశ్మీరీ విద్యార్థులు..
సాక్షి, సిటీబ్యూరో :ఫస్ట్ టైమ్ థియేటర్‌లో సినిమా చూస్తే ఎంత ఫీల్ ఉంటుంది? అందులోనూ ఐమ్యాక్స్‌లో చూస్తే ఆ కిక్కే వేరు కదా! ఆ అనుభూతిని ఆస్వాదించిన కశ్మీరీ బృందం ఆనందం, ఆశ్చర్యానికి లోనైంది. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో భాగంగా నగరానికి వచ్చిన ఈ బృందం... తాము హైదరాబాద్‌కు రావడం ఇదే మొదటిసారి అని, థియేటర్‌లో సినిమా చూడడం కూడా ఇదే తొలిసారి అని పేర్కొంది.
నదీం అహ్మద్, అర్బీన్ హసన్, రశికాజాన్, ఉఫాక్ రహీం, అదీబాజాన్, శాయిస్తా, షాబాజ్, అఖిల్ అహ్మద్, షేక్ సాహీల్, బేగ్ అదిల్ కశ్మీర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు. ఇద్దరు ఉపాధ్యాయులతో కూడిన ఈ బృందం హైదరాబాద్‌కి రావడం ఇదే తొలిసారి. చలన చిత్రోత్సవాల్లో భాగంగా మొదటిసారి థియేటర్‌లో సినిమా చూసిన వీరు.. తమ ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.
కశ్మీర్‌లోనే ఉండవు..
మాది హర్యానా. రెండు నెలల క్రితం ఇక్కడికి వచ్చాను. ముందు చాలా భయపడ్డాను. కానీ వచ్చాక తెలిసింది.. ఇక్కడికి వాళ్లు చాలా మంచివారని. దుస్తులు శరీరాన్ని పూర్తిగా కప్పేలా వేసుకోవాలనే నియమాన్ని ఇక్కడి అమ్మాయిలు నమ్మి పాటిస్తారు. విద్యా, విజ్ఞానం, సాంకేతికత, సోషల్ మీడియా వాడకం విషయంలో వేరే రాష్ట్రాలతో పోలిస్తే పెద్దగా తేడాలేమీ లేవు. ఇక్కడ కొన్నేళ్ల క్రితం థియేటర్లు మూయించారు. కేవలం కశ్మీర్‌లోనే సినిమా హాళ్లు ఉండవు. శ్రీనగర్‌లో మాల్స్, థియేటర్లు ఉంటాయి. – వీనా, టీచర్
బిర్యానీ సూపర్బ్
నేను ఉర్దూ టీచర్. థియేటర్లు లేకపోవడంతో స్కూల్‌లో పిల్లలకు అవసరమైన చిత్రాలను ప్రొజెక్టర్‌తో చూపిస్తాం. కల్చరల్ సెంటర్లు ఉంటాయి. అక్కడ మా సంస్కృతి సంప్రదాయాలు తెలిపే నాటకాలు, డ్యాన్స్‌లు ప్రదర్శిస్తుంటారు. నాకు హైదరాబాద్ బిర్యానీ బాగా నచ్చింది. – రజీ, టీచర్
అక్కడా ఉంటే బాగుండు..
ఈ చిత్రాలు నాపై చాలా ప్రభావాన్ని చూపాయి. ఇంతమంది పిల్లలతో కలిసి సినిమాలు చూడడం చాలా కొత్తగా ఉంది. మా దగ్గర సినిమా చూసే అవకాశమే లేదు. థియేటర్‌లో సినిమా చూడడం తప్పు అని చెబుతారు. కానీ మేం ఇక్కడ చూసిన సినిమాల్లో తప్పేం కనిపించలేదు. మా దగ్గర కూడా థియేటర్లు ఉంటే బాగుండు. – అర్బీనాహసన్, విద్యార్థిని
నేనే కట్టిస్తా...
దేవుడి దయుంటే నేనే థియేటర్ కట్టిస్తాను. నాలాంటి చాలా మంది పిల్లలు చూసేందుకు వీలుగా ఇలాంటి చిత్రాలు ప్రదర్శిస్తాను. వీటిని చూస్తే ఆలోచనల్లో మంచి మార్పులు తథ్యం. అంతగా స్ఫూర్తినిచ్చాయి. – రశికాజాన్
రూపొందిస్తాం..
ఈ చిత్రాలు చూసిన తర్వాత మాకు సినిమాలు తీయాలని అనిపిస్తోంది. అయితే మా దగ్గర అది కుదరదు. కుదిరితే తప్పకుండా సందేశాత్మక చిత్రాలు రూపొందిస్తాం. – ఉఫక్ రహీం
అలాగే మాకూ..
‘హాఫ్ టికెట్’ సినిమా చూశాను. పిజ్జా తినేందుకు ఒక స్లమ్ అబ్బాయి చేసిన పోరు ఈ చిత్రం. బాబుకి పిజ్జా తినాలనే కోరిక ఉన్నట్లే... ఇప్పుడు మాకు కశ్మీర్‌లో థియేటర్లు ఉంటే బాగుండనిపిస్తుంది. పిల్లలందరూ కోరుకుంటే అది జరగవచ్చు కూడా. – శాయిస్తా
సహకరిస్తే సాధ్యమే..
ఇలాంటి స్ఫూర్తివంతమైన చిత్రాలు చూసినప్పుడు సినిమాలు తీయాలనే ఆలోచన మాకు వస్తుంటుంది. కానీ ఏం చేస్తాం.? మా దగ్గర థియేటర్లు లేవు. సినిమాలు తీయనివ్వరు. మాకు పెద్దల సహకారం లభిస్తే మేం కూడా చిత్రాలు రూపొందిస్తాం. – శాబాజ్ అహ్మద్
వెరీ ఫ్రెండ్లీ..
పిల్లలు స్వయంగా రూపొందించిన, నటించిన చిత్రాలు తొలిసారి థియేటర్‌లో చూశాం. చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మనకు చేతనైనంతలో ఇతరులకు హెల్ప్ చేయాలనేది చాలా చిత్రాల్లో ఇచ్చిన మెసేజ్. ఇక్కడి వారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. – బేగ్ అదిల్
Comments
Please login to add a commentAdd a comment