జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడితో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోషల్ మీడియాలోనూ, స్థానికంగానూ కశ్మీరీలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారం నేపథ్యంలో డెహ్రాడూన్, అంబాలా, ముల్లానా కాలేజీల్లోనూ, యూనివర్సిటీల్లోనూ చదవుకొంటోన్న వందలాది మంది కశ్మీరీ విద్యార్థులు హాస్టళ్ళు ఖాళీ చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. బెదిరింపులు, హెచ్చరికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల సర్పంచులు, స్థానికులు 24 గంటల్లోగా ఖాళీ చేసి వెళ్ళాలని హెచ్చరించడంతో ముల్లానా, డెహ్రాడూన్ లనుంచి పంజాబ్‌లోని లాంద్రాన్‌కి వచ్చిన వందమంది కశ్మీరీ విద్యార్థులకు స్థానిక గురుద్వారాలు ఆశ్రయం ఇచ్చి, వారికి వసతి, భోజనసదుపాయాలు సమకూర్చాయి. అదేవిధంగా 70 మంది విద్యార్థులకు జమ్మూకశ్మీర్ స్టుడెంట్స్ ఆర్గనైజేషన్ (జెకెఎస్‌ఓ) లాంద్రాన్‌లో తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది. లాంద్రాన్‌కి వచ్చిన వారిలో కొంత మంది మంగళవారం కశ్మీర్‌కి వెళ్ళిపోయారు.
ప్రభుత్వం కశ్మీర్ విద్యార్థుల రక్షణ బాధ్యతను తీసుకుంటుందనీ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. లాంద్రాన్, సోహానా ప్రాంతాల్లో పోలీసు వాహనాలను మోహరించినట్టు మొహలీ సీనియర్ పోలీసు అధికారి హరిచరణ్ సింఘ్ భుల్లార్ వెల్లడించారు. సొహానా గురుద్వారాలో కశ్మీరీ విద్యార్థులకు ఆశ్రయం కల్పించిన గురుద్వారాకి చెందిన అమరీందర్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని, కశ్మీరీలైనంత మాత్రాన వాళ్ళు తప్పు చేసినట్టు కాదనీ, ఎక్కడైనా చెడ్డవాళ్ళు ఉంటారనీ, అంతమాత్రాన అందరినీ అదేగాటన కట్టాల్సిన పనిలేదనీ వ్యాఖ్యానించారు.
పుల్వామాలో జరిగిన దాడి ముమ్మాటికీ తప్పేననీ, అంతమాత్రాన విద్యార్థులను టార్గెట్ చేయడం కూడని పని అని విద్యార్థులు ఆశ్రయం పొందుతోన్న గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సంత్ సింఘ్ అభిప్రాయపడ్డారు. డెహ్రాడూన్ లోని ప్రైవేటు విద్యాసంస్థలో చదువుతూ అక్కడి నుంచి పారిపోయి వచ్చి మొహలీలో ఆశ్రయం పొందుతోన్న సమీర్ అనే విద్యార్థి డెహ్రాడూన్‌లో తనకూ, తన తోటి విద్యార్థులకూ జరిగిన చేదు అనుభవాలను మీడియాకి వెల్లడించారు. అద్దెకి ఉంటోన్న తమ ఇంటి ఎదుట కొందరు కశ్మీర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రదర్శన నిర్వహించినట్టు అతను తెలిపారు. కొందరు ఆందోళన కారులు తమ ఇంటి తలుపులపై దబ దబా బాదుతూ బయటి రావాలంటూ దుర్భాషలాడినట్టు వెల్లడించారు. దీంతో భయపడిపోయి రెండు రోజుల పాటు ఇంట్లోనే దాక్కున్నట్టు చెప్పారు.
మరో ఘటనలో 12 మంది కశ్మీరీ విద్యార్థులపై స్థానికులు భౌతిక దాడికి దిగారని తెలిపారు. కొన్ని షాపుల యజమానులు ఏకంగా షాప్ ఎదుటే ‘కశ్మీరీలకు అనుమతి లేదు’’ అంటూ, ఇంకా తీవ్రమైన పదజాలంతో బోర్డులు పెట్టుకున్నారని విద్యార్థులు తెలపారు. మరో విద్యార్థి తమ ఇంటి యజమానులు సైతం తమ ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో భయంతో అక్కడి నుంచి పారిపోయి పోలీసుల ఆశ్రయం పొందినట్టు వివరించారు. కొందరు ఇంటి యజమానులు మాత్రం విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేసారని, వీరి గదులకు తాళాలు వేసి కశ్మీరీ విద్యార్థులు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు ఆందోళన కారులకు చెప్పినట్టు వివరించారు.
కశ్మీర్‌లో చాలా సంఘటనలు జరుగుతున్నాయి, అక్కడ ప్రశాంతత కొరవడింది, అందుకే చదుకోవడానికి పంజాబ్ వచ్చామని చండీగఢ్‌లో చదువుతోన్న అద్నాన్ అనే విద్యార్థి వెల్లడించారు. నిజానికి ఎటువంటి రక్తపాతాన్నీ తాము అంగీకరించబోమనీ, పుల్వామా దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనీ స్పష్టం చేశారు. అయితే కశ్మీర్ వాస్తవ్యులం కావడమే మేం చేసిన నేరంగా భావిస్తున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. మాకు అక్కడా, ఇక్కడా, దేశంలో ఎక్కడా రక్షణ లేకుండాపోయిందనీ, ఇంకెక్కడికి వెళ్ళాలంటూ ప్రశ్నించారు. ఆ విద్యార్థి తన ఐడెంటిటీ కార్డుచూపిస్తూ ఇది నేను భారతీయుడినని నిర్ధారిస్తోంది. కానీ మేము కశ్మీర్ విద్యార్థులం అని తెలియడంతో మమ్మల్ని నేరస్తులుగా చూస్తున్నారనీ, వేధింపులకు గురిచేస్తున్నారనీ వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment