సాక్షి,సిటీబ్యూరో: చుట్టూ మంచుకొండలు.. అందమైన లోయలు.. అద్భుతమైన సరస్సులు.. ఒకప్పుడు సందర్శకులతో కళకళలాడిన కశ్మీర్ లోయ ఇప్పుడు అనుక్షణం భయం గుప్పిట్లో బతుకుతోంది. గతంలో భూతల స్వర్గంలోవిహరించిన ప్రజలు ఇప్పుడు బంకర్లలోబతుకీడుస్తున్నారు. నిత్యం బాంబుల మోత.. తుపాకీ గుళ్ల వర్షాన్ని చూస్తున్న అక్కడి ప్రజలు తాము పుట్టిన గడ్డపై మమకారం చంపుకోలేక.. ప్రాణాలను పణంగా పెట్టి కొందరు అక్కడే ఉంటే.. ఇంకొందరు దేశంలోని ఇతర నగరాలకు వలస వెళున్నారు. అక్కడి పరిస్థితులుచక్కబడ్డాక తిరిగి పోతున్నారు. అయితే, అలా మహానగరానికి వలస వచ్చిన కొందరు కశ్మీరీలు ప్రస్తుత పరిస్థితుల్లో సొంత గడ్డకు వెళ్లేందుకు జంకుతున్నారు.
‘ఉగ్రదాడులతో ఎప్పుడుఏం జరుగుతుందో తెలియదు. పాక్ ప్రేరేపిత∙ముష్కరుల దాడులతో ఏడు దశాబ్దాలుగా నరకం చూస్తున్నాం. ఎక్కడ నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియదు. పుల్వామా దాడితో యావత్తు కశ్మీర్ ఉలిక్కిపడుతోంది’ అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. కశ్మీర్‌లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో డిసెంబర్‌లో కొందరు అక్కడి నుంచి నగరానికి వచ్చారు.వీరు ఫిబ్రవరిలో తిరిగి వెళ్లాలని భావించినా.. ‘పుల్వామా’ దుర్ఘటన చోటుచేసుకుంది.నగరంలో ఉన్న కశ్మీరీలను ‘సాక్షి’ పలకరించగా వారి మనసు పడుతున్న సంఘర్షణను, కళ్లల్లో భయాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తూ తమ అనుభవాలను వెలుబుచ్చారు.
ప్రతి ఏటా చలికాలంలో నగరానికి..
నిరంతరాయంగా కురిసే బుల్లెట్ల వర్షం.. గర్జించే మోర్టార్లు, రాకెట్ లాంచర్లు.. బాంబుల పేలుళ్లు. భారత్, పాకిస్థాన్ సరిహద్దు నిరంతంరం రావణ కాష్టం. నగరానికి వచ్చిన వారిలో ఎక్కువ శాతం కశ్మీర్‌లోని పూంచ్, రాఝౌరి జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలే. ప్రస్తుతం అక్కడ ఉంటున్న ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు బంకర్లలో తలదాచుకుంటున్నారు. పాక్ సైన్యం జమ్మూ– కశ్మీర్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. ఇక ప్రకృతి వైపరీత్యం కారణంగా ఈ ఏడాది జమ్మూ కశ్మీర్‌లో కొన్నేళ్ల నుంచి చలికాలంలో తీవ్రమైన మంచు కురుస్తోంది. జన జీవనం స్తంభించిపోతుంది.
ఈ ఏడాది జమ్మూ కశ్మీర్‌లో చలి తీవ్రత పెరగడంతో అక్కడి ప్రజలకు ఎలాంటి ఉపాదీ దొరకడం లేదు. ముఖ్యంగా పూంచ్, రాఝౌరి తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 7–10 డిగ్రీలకు పడిపోతాయి. డిసెంబర్, జనవరి నెలల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఫలితంగా అక్కడి ప్రజలకు ఎలాంటి వ్యాపారాలు, వ్యవసాయం, కూలి పనులు దొరకవు. దీంతో ప్రజలు తమ కుటుంబ సభ్యులకు ఈ రెండు నెలలకు కావాల్సిన వసతులు అందించి పురుషులు, యువకులు దక్షిణాది నగరాలకు ఉపాధి కోసం వస్తారు. వృద్ధులు భిక్షాటన చేసుకుంటూ బతుకుతుంటారు. ఇలా నగరానికి వచ్చిన కశ్మీరీలు మక్కా మసీదు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై ఉంటూ వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. వీరికి పాతబస్తీ ప్రజలు తోచినంత సహాయం చేస్తుంటారు. స్వచ్ఛంద సంస్థలు వారికి దుప్పట్లు, నిత్యావసర సరుకులు అందించి ఆదుకుంటున్నాయి.
ప్రశాంతత కోల్పోయాం..
కశ్మీర్ గురించి అందరికీ తెలిసింది అది భూలోక స్వర్గమని. కానీ మా కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏడాదిలో 7 నెలలు పనులు దొరుకుతాయి. మిగతా కాలం ఉపాధి లేక అవస్థలు పడుతుంటాం. ఇక ఉగ్రవాద చర్యలతో ప్రతిక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతుంటాం. నిత్యం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఆ దేశ సైన్యం సరిహద్దు గ్రామాలపై దాడులు చేస్తునే ఉంటాయి. దీంతో మేం ప్రశాంతంగా ఉండలేం. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడితేనే మా బతుకులు బాగుంటాయి. – గులాం ఖాదర్, రాఝౌరీ జిల్లా
బంకర్లలోనే బతుకులు
కశ్మీర్‌లో యాబై ఏళ్లుగా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. మూడు తరాలుగా మా జీవితాలు భయంతోనే నడుస్తున్నాయి. మా గ్రామం పూంచ్ జిల్లాలో పాక్‌కు సరిహద్దులో ఉంది. ఇరు దేశాల మధ్యా ఉద్రికత్తత నెలకొంటే మేం ఇళ్లు వదలి బంకర్లతో తలదాచుకుంటాం. మేము ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. పాకిస్తాన్ ప్రతిసారీ శాంతి ఒప్పందాన్ని ఉల్లఘిస్తునే ఉంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలని దేవుడి వేడుకుంటున్నాం. మా తల రాతలు ఎప్పుడు మారుతాయో? – అబ్దుల్ ఖయ్యూం పూంచ్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment