అందరిలా ఆడాలి.. పాడాలని ఉంటుంది. కానీ అక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉండవు. గొంతెత్తి అరవాలని, స్నేహితులతో ముచ్చట్లు పెట్టాలనిసరదాగా షికార్లు చేయాలని ఉంటుంది. అందుకు అక్కడి వాతావరణం ఎంత మాత్రం అనుకూలించదు. జైలు పక్షుల్లా జీవితం. ఇలాంటి వాతావరణం నుంచి ఒక్కసారిగా స్వేచ్ఛాయుత ప్రపంచంలోకి అడుగు పెడితే వారి ఆనందానుభూతులు ఎలా ఉంటాయో తెలియజెప్పే సంఘటనకు గురువారం జూబ్లీహిల్స్‌లోని సదరన్ సెక్టార్‌సీఆర్‌పీఎఫ్ కార్యాలయం వేదికైంది.
బంజారాహిల్స్: కేంద్ర ప్రభుత్వం భారత దర్శన్ యాత్ర 2019–20 (వతన్ కో జానో) పేరుతో ఓ కార్యక్రమాన్ని కశ్మీరీ యువత, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసింది. ఏటా కొంత మంది విద్యార్థులు, యువతీయువకులను భారతదేశంలోని మిగతా ప్రపంచాన్ని చూసి అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం సీఆర్‌పీఎఫ్ సదరన్ సెక్టార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు అయిదు రోజుల పాటు ఈ విద్యార్థులంతా హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. టీనేజీ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ లలితా ఆనంద్, సీఏ హర్షిణి నకాతే ఇక్కడ నిర్వహించిన వర్క్‌షాప్‌లో కశ్మీరీ యువతీయువకులకు బాహ్య ప్రపంచం ఎలా ఉంటుందో తెలియజేయడమే కాకుండా ఆటపాటలతో వారిని సరదాగా గడిపేలా చేశారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వర్క్‌షాప్ నిర్వహించారు. పది మందిలో ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడటం ఎలాగో చూపించారు. ధైర్యంగా పది మంది ముందుకు వచ్చి మాట్లాడిస్తూ వారిలో ధైర్యాన్ని నూరిపోశారు. 50 మంది వరకు విద్యార్థినీవిద్యార్థులు కశ్మీర్‌లోని బారాముల్లా, భానిపురా, బాండీపుర సరిహద్దు గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేశారు.
హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలు, ఇక్కడి చారిత్రక స్థలాలు, కట్టడాలు, హెరిటేజ్ ప్రాంతాలతోపాటు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులతో కలుసుకునే ఏర్పాట్లనూ ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహించారు. ప్రస్తుతం కశ్మీర్‌లో ఉన్న పరిస్థితి దృష్ట్యా వీరంతా హైదరాబాద్‌కు ఆడుతు, పాడుతూ సరదాగా గడుపుతూ సందడి చేశారు. ఎవరిని కదిపినా తమ ఆశయ సాధన కోసం కష్టపడాలని ఉందని కొందరు క్రికెట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని, ఇంకొందరు వాలీబాల్, ఫుట్‌బాల్, టెన్నిస్‌లో రాణించాలని కోరుకున్నారు. అయితే ఇవన్నీ అంతగా జరిగే పనులు కావని నిట్టూర్చిన సందర్భాలూ ఉన్నాయి. ఈ పర్యటన వారిలో నూతనోత్తేజాన్ని నింపిందనే చెప్పొచ్చు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, రిలీజియస్ హెరిటేజ్‌ను వీరికి పరిచయం చేశారు. ఈ నెల 21న ఫిలింసిటీ, 22న ఏకే ఖాన్‌తో ముఖాముఖి, హుస్సేన్‌సాగర్, లుంబినీపార్కు, ఎన్టీఆర్ గార్డెన్ సందర్శన, 23న సాలర్జంగ్ మ్యూజియం, చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్ ప్రదర్శన, 24న గవర్నర్‌తో ముఖాముకి అనంతరం గోల్కొండ కోటను సందర్శిస్తారు.
చాలా ఆనందంగా ఉంది
హైదరాబాద్‌ను సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది యువతీయువకులతో ఆడుతూ పాడుతూ గడిపాం. ప్రస్తుతం బీఏ చదువుతున్న నేను జర్నలిస్టు కావాలని.. కశ్మీర్‌లోని యదార్థ ఘటనలను బాహ్య ప్రపంచం చూసేలా కృషి చేయాలని ఉంది. – హీనా, బీఏ ఫైనల్, బానీపుర
మూడు నెలలుగా బడి లేదు
కశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మూడు నెలలుగా పాఠశాలలు తెరుచుకోలేదు. 9వ తరగతి చదువుతున్నాను. ఐఏఎస్ కావాలన్నది నా ఆశయం. విద్యార్థులంతా బడికి పోతుంటే ఈ రోజు హైదరాబాద్‌లో చూసి ఎంతో ఆనందించాను. ప్రస్తుతం ఇంట్లోనే ట్యూషన్ పెట్టించుకొని చదువుకుంటున్నాను. – కుర్మత్, 9వ తరగతి, బానీపుర
రాత్రి 10 తర్వాతా స్వేచ్ఛగా తిరగాలి
12వ తరగతి చదువుతున్నా. సైంటిస్ట్ కావాలన్నది నా కోరిక. కశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. రాత్రి 10 దాటితే బయటకు వెళ్లలేని పరిస్థితి. హైదరాబాద్ చూస్తుంటే ముచ్చటేస్తున్నది. ఇక్కడికి నేను మొదటిసారి వచ్చాను. – ముస్తఫా, బానాపుర
ఐఏఎస్ కావాలని ఆశ
బాండీపురలోని జీడీసీ సుంబల్ కాలేజీలో బీఏ చదువుతున్నాను. ఐఏఎస్ కావాలన్నది నా ఆశ. చక్కగా ఆడుకొని మంచి స్పోర్ట్స్ పర్సన్ కావాలని అనుకుంటాం. పరిస్థితి మాత్రం అంతగా అనుకూలించదు. హైదరాబాద్‌కు మొదటిసారి వచ్చాను. ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. – ఊఫత్, బాండీపుర
Comments
Please login to add a commentAdd a comment