సాక్షి, హైదరాబాద్: ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే తీవ్రంగా స్పందిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. భావ వ్యక్తీకరణ పేరుతో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను ఆరు మాసాలపాటు హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటిం చారు.
సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ, కత్తి మహేశ్‌కు వ్యతిరేకంగా ఆందోళనల పేరుతో మరికొన్ని గ్రూపులు రంగంలోకి దిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేసేందుకు యత్నిస్తున్నాయని, వారికి తామెంత మాత్రం అవకాశం ఇవ్వబోమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
‘భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కే. దాన్ని సరైన రీతిలో వినియోగించుకోవాలే తప్ప ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించకూడదు. తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్, హాజర్డష్ యాక్టివిటీస్ యాక్ట్ 1980 కింద ఆరు నెలల పాటు కత్తి మహేశ్‌ను రాజధాని నుంచి బహిష్కరిస్తున్నాం.
మహేశ్‌ను తన స్వస్థలమైన చిత్తూరు జిల్లా కు తరలించాం. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా హైదరాబాద్‌లో ఉండొచ్చు. కాని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, సమాజాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఇలాంటి వ్యక్తులకు సహకరించే వారిపైనా చర్యలు తప్పవు’ అని ఆయన హెచ్చరించారు.
న్యూస్ చానల్‌పై చర్యలు
కత్తి మహేశ్ వ్యాఖ్యలను పదే పదే ప్రసారం చేసి ప్రజ ల్లో అశాంతి కలిగేలా వ్యవహరించిన ఓ న్యూస్ చాన ల్‌పై చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. సంబంధిత చానల్ నిర్వాహకులకు షోకాజ్ నోటీస్ జారీ చేశామని, ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన సదరు చానల్‌పై కేబుల్ టీవీ నెట్‌వర్క్ యాక్ట్ నంబర్–7 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. చానల్ ఇచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చ రించారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా, తీసుకునేలా ప్రేరేపించినా కేసులు నమోదు చేసి కటకటాల్లోకి పంపిస్తామన్నారు. నగర బహిష్కరణ ఉత్తర్వులను ఉల్లంఘించి కత్తి మహేశ్ మళ్లీ నగరంలోకి అడుగుపెడితే మూడేళ్లపాటు జైలు శిక్షకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. కేబుల్ టీవీ నెట్‌వర్క్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలకు రెండేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందన్నారు.
అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ
రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామని డీజీపీ తెలిపారు. సరైన చర్యలు తీసుకునేలా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. కత్తి మహేశ్ బహిష్కరణ ప్రస్తుతం హైదరాబాద్ వరకే పరిమితమని, అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ విధిస్తామన్నారు. ఏపీలో మీడియాతో మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటామన్నారు.
కత్తి మహేశ్‌పై ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయన్నారు. ధార్మిక సంఘాలు, ఇతరులు చట్టాలను చేతుల్లోకి తీసు కుని అశాంతికి కారణం కావద్దని, ఏదైనా సమస్య తలె త్తితే దాన్ని పరిష్కరించేందుకు పోలీస్ శాఖ, ప్రభుత్వం ఉందన్నారు. సమావేశంలో నగర కమిషనర్ అంజనీకుమార్, అదనపు డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, డీఐజీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
కత్తి మహేశ్‌పై కేసు నమోదు
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటమే కాకుండా, సీతారాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. టీవీ చర్చా వేదికలో రామాయణాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ సంబంధిత ఆధారాలతో రహ్మత్‌నగర్‌కు చెందిన గడ్డం శ్రీధర్ అనే వ్యక్తి ఈనెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కత్తి మహేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డీజీపీని కలసిన బీజేపీ ఎమ్మెల్యేలు
కత్తి మహేశ్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, రాజాసింగ్.. రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో డీజీపీని కలిశారు. స్వామి పరిపూర్ణానంద పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతోపాటు ఆయనను గృహ నిర్బంధం చేయడం, ఆయన ఇంటికి తాము వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై ఫిర్యాదు చేశారు.
మహేశ్ నగర బహిష్కరణపై రాజాసింగ్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ నుంచి బహిష్కరించాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. యాదాద్రి సందర్శనకు పరిపూర్ణానందకు అనుమతివ్వాలని కోరినట్టు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment