సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా టీడీపీ తరఫున ఎవరు పోటీలో ఉంటారనేది దాదాపు తేలిపోయింది. ఆఖరు నిమిషంలో పరిణామాలు మారి హఠాత్తుగా మరోపేరు తెరపైకి వస్తే తప్ప వెంకటాపురం జడ్పీటీసీ సభ్యురాలు గడిపల్లి కవిత పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు అందరితో మాట్లాడి ఓకే చెప్పారని, గురువారం ఉదయం అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాల సమాచారం. అయితే, చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మరో సభ్యుడి మద్దతు కూడా తుమ్మల కూడగట్టినట్టు తెలుస్తోంది.
సీపీఐ, సీపీఎం రెండూ టీడీపీకి మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నా, ఆ రెండు పార్టీలు మాత్రం అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ఇక కాంగ్రెస్ తమ అభ్యర్థిని బరిలో దింపాలనే ఆలోచన ఉన్నా గురువారం నాటి పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకోనుంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులకు విప్ జారీ చేశాయి. వైఎస్సార్‌సీపీ కూడా గురువారం నాటి పరిణామాలను పరిశీలించి తన వైఖరిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక, పశ్చిమగోదావరి జిల్లా పట్టాయిగూడెం క్యాంపులో ఉన్న టీడీపీ సభ్యులు నేరుగా సమావేశం సమయానికి జడ్పీ కార్యాలయానికి చేరుకుంటారని సమాచారం. వైస్‌చైర్మన్ పదవికి కారేపల్లి జడ్పీటీసీ ఉన్నం వీరేందర్ లేదా పాల్వంచ జడ్పీటీసీ సభ్యుడు బరపాటి వాసులలో ఒకరిని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీడీపీ కాకుండా ఒక్కరు వస్తే చాలు...
మొత్తం 19 మంది జడ్పీటీసీ సభ్యుల బలం టీడీపీకి ఉండగా, మరొక సభ్యుడు లేదా సభ్యురాలు సమావేశానికి వస్తే ఎన్నిక జరుగుతుంది. వాస్తవానికి జడ్పీలో 39 మంది సభ్యులున్నారు. జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నిక జరగాలంటే ఇందులో సగం కంటే ఎక్కువ అంటే 20 మంది (కోరం) సమావేశానికి హాజరుకావాలి. 20 మంది వస్తే ఎన్నిక జరుగుతుంది.
అయితే, సమావేశానికి అంతకన్నా ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీకి చెందిన ముగ్గురు మినహా 36 మంది సభ్యులు సమావేశానికి హాజరవుతారని అంచనా. అలా అయితే, 19 మంది (హాజరైన వారిలో సగం కంటే ఒకటి ఎక్కువ) సభ్యుల మద్దతు ఎవరికి ఉంటే వారు పాలకవర్గం గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఎన్డీ సభ్యులు కూడా ఎన్నిక ప్రక్రియ సమావేశానికి హాజరయితే 20 మంది మద్దతు అవసరమవుతుంది.
టీడీపీకే మద్దతు ?
కాగా, జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికలో సీపీఐ, సీపీఎం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు పార్టీలు టీడీపీకి మద్దతివ్వనున్నట్టు సమాచారం. ఇందుకు గాను ఆ రెండు పార్టీలకు చెరో కో-ఆప్షన్ పదవి ఇస్తారని తెలుస్తోంది. దీంతో పాటు త్వరలో జరగబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి. న్యూడెమోక్రసీ మాత్రం ఎన్నికను బహిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. టీడీపీ సభ్యులందరూ ఒకే మాట మీద ఉంటే ఎవరి అవసరం లేకుండానే ఆ పార్టీకి ఏకగ్రీవంగా పాలకవర్గం దక్కనుంది.
నాటి బాలసాని ఉదంతంలా అవుతుందా..?
అయితే, పార్టీ అధినేత వద్ద మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఉన్న పలుకుబడిపై కూడా తుమ్మల వర్గం అంచనాలు వేస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తొలుత పాలేరు ఎమ్మెల్యే స్థానాన్ని తుమ్మల వర్గానికి చెందిన బాలసాని లక్ష్మీనారాయణకు కేటాయిస్తున్నట్టు మీడియాలో వచ్చింది. రాత్రి బాలసాని పేరు ఖరారు కాగా, తెల్లారేసరికి నామా నాగేశ్వరరావు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి తన వర్గీయురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారికి టికెట్ ఇప్పించారు.
ఈ విషయంపై తుమ్మల వర్గం నాయకులు, బాలసాని బహిరంగంగానే హల్‌చల్ చేశారు కూడా. ఇదే పరిస్థితి మళ్లీ ఎదురవుతుందేమోననే సందేహాన్ని తుమ్మల వర్గం వ్యక్తం చేస్తోంది. కవిత పేరును ఖరారు చేసినా మళ్లీ తుది నిమిషంలో ఏదైనా మార్పు ఉంటుందా అనే కోణంలో కూడా తుమ్మల వర్గం సిద్ధమవుతున్నట్టు సమాచారం. కవిత పేరును టీడీపీ అధిష్టానం ప్రకటించకపోయినా ఆమె ఆ పీఠంపై కూర్చునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఆమెకు మద్దతిచ్చేందుకు ఇతర పార్టీలు ముందుకొచ్చాయని తెలుస్తోంది. ఈ మేరకు తుమ్మల వర్గానికి చెందిన నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన ట్టు ప్రచారం జరుగుతోంది.
కవితకే ఖరారు!
Published Thu, Aug 7 2014 1:54 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement