సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసు శాఖను గౌరవ స్థానంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో కలిసి లక్డీకాపూల్‌లో ఉమెన్ సేఫ్టీ వింగ్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలువురు మహిళ ఐపీఎస్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. మహిళ భద్రతకి షీ టీమ్స్, క్యాబ్స్, పోలీసు స్టేషన్లు, భరోసా సెంటర్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
మహిళల భద్రతపై ఎంత అప్రమత్తంగా ఉన్న ఇంకా దాడులు జరుగుతున్నాయని ఎంపీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలకు ఏ కష్టం వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేరం జరిగినప్పుడు నిందితులకు తగిన శిక్షపడే విధంగా ఉమెన్స్ వింగ్ ఏర్పాటు చేశామని ప్రకటించారు. విద్యార్థినులు మొబైల్స్‌లో హాక్ ఐ ఆప్లికేషన్ ఉంచుకోవాలని.. పోలీసులతో కలిసి ముందుకు నడవాలని కోరారు. ప్రతి జిల్లాలో కూడా మహిళల కోసం భరోసా సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు ఏ కష్టం వచ్చినా 100కి ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె.. మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మహమూద్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పోలీస్ శాఖకి పెద్ద పీట వేసినట్టు గుర్తుచేశారు. శాంతి భద్రతలను కాపాడటం కష్టం అవుతుందని అప్పటి సీఎం అన్నారని.. కానీ తెలంగాణ ఇప్పుడు శాంతి భద్రతలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు పోలీసులంటే భయం పోయిందని తెలిపారు. మహిళ భద్రతకు అధిక ప్రాధన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమెన్స్ వింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు.
డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా హైదరాబాద్‌లో ఉమెన్స్ సెఫ్టీ వింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ కావాలని ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసిందన్నారు. షీ టీమ్స్ సారథి ఉన్న స్వాతి లక్రాను ఆయన అభినందించారు. తెలంగాణలో తొమ్మిది కమిషనరేట్‌లు ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు పెద్ద పీట వేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment