► ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు..
► రూ. 26 కోట్లు కేటాయింపు
► ఈనెల 8న ఘనంగా దావత్-ఎ-ఇఫ్తార్
►నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు
► ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇఫ్తార్ విందు
► 1.95 లక్షల పేద కుటుంబాలకు కొత్త వస్త్రాల పంపిణీ
► ఇమామ్‌లు, మౌసన్‌లకు నెలకు రూ. వెయ్యి భృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత విశిష్ట సంస్కృతి సంప్రదాయాలు, మత సామరస్యాన్ని దేశానికి చాటి చెప్పేలా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ముస్లిం సోదరుల గౌరవార్థం ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.26 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తామని చెప్పారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున పలు కానుకలను ప్రకటించారు. ఈ నెల 8న హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దావత్-ఎ-ఇఫ్తార్ నిర్వహించనున్నట్లు చెప్పారు. తనతో పాటు మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇఫ్తార్ విందుకు హాజరవుతారన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ అనుమతితో టర్కీ, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేసియా తదితర దేశాలకు చెందిన రాయబారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ నేతృత్వంలో ఈ ఏర్పాట్లు జరుగుతాయని, దాదాపు నాలుగైదు వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్‌కు ఏర్పాట్లు జరుగుతాయని కేసీఆర్ వెల్లడించారు. దీంతోపాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని వంద మసీదుల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని మసీదుల్లో ప్రభుత్వ ఖర్చుతో ఈ ఏర్పాట్లు చేస్తామని, ప్రతి చోట దాదాపు వెయ్యి మందికి ఇఫ్తార్ విందు భోజనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
పేద కుటుంబాలకు వస్త్రాలు..
రంజాన్ పర్వదినం సందర్భంగా 1.95 లక్షల మంది ముస్లిం నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.500 విలువైన కొత్త వస్త్రాలు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మసీదుల్లోని ఇమామ్‌లు, కమిటీల ఆధ్వర్యంలో వస్త్రాల పంపిణీ జరుగుతుందని, అదే రోజున 1.95 లక్షల మందికి భోజన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఐదు వేల మసీదుల్లో ఉన్న ఇమామ్‌లు, మౌసన్‌లకు నెలకు రూ.వెయ్యి భృతి అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. వక్ఫ్ బోర్డు ద్వారా వీటిని అందిస్తామని.. రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్ మసీదుల్లో ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందని తెలిపారు. వస్త్రాల పంపిణీకి రూ.9.75 కోట్లు, భోజనాల ఖర్చుకు రూ.4 కోట్లు, ఇమామ్‌లకు అందించే నెలసరి భృతికి ఏడాదికి రూ.12 కోట్లు ఖర్చు అవుతాయన్నారు.
అధికారులతో కమిటీ..
ప్రభుత్వం తరఫున చేపట్టే కార్యక్రమాల వసతులు, ఏర్పాట్లు, వస్త్రాల పంపిణీ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ ఆధ్వర్యంలో సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలని, కొత్త వస్త్రాల పంపిణీ నిరుపేద కుటుంబాలకే అందాలని సూచించారు. 1.95 లక్షల కుటుంబాలకు వస్త్రాలను పంపిణీ చేయనున్నా.. అంతకంటే ఎక్కువ పేద కుటుంబాలు ఉండే అవకాశముందని, రాబోయే సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తరిద్దామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం వెంట డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీలు సలీం, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ముస్లిం సోదరులకు కానుకలు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు మహమూద్ అలీ కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్.. రంజాన్ కానుకలు
Published Fri, Jul 3 2015 4:44 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement