
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020–21 పూర్తి సమతుల్యతతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఇది సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్‌గా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్ అని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.
దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొని రాబడులు తగ్గి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతలు పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల వికాసానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, సంక్షేమ పథకాల్లో మరింత మంది పేదలకు అవకాశం రావాలనే సంకల్పానికి, ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారని తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి హరీశ్‌రావును సీఎం అభినందించారు. మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఆర్థిక శాఖ అధికారులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment