
కేసీఆర్‌ది నిరంకుశ పాలన
రాంనగర్: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రుణమాఫీపై రోజుకో మెలిక పెడుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాడని విమర్శించారు. సమగ్ర సర్వే చెత్తబుట్టలో వేసుకోవడానికి తప్ప, ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1200 కోట్లు ఖర్చుచేసి శ్రీశైలం సొరంగమార్గం పనులు మొదలు పెట్టిందని, మరో రూ.1200 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తయి జిల్లాకు సాగు, తాగునీరందుతుందన్నారు. నక్కలగండి ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వీటన్నిం టనీ పక్కన పెట్టి జారాల-పాకాల పాట పాడడం సరైంది కాదన్నారు. అది పూర్తయ్యేసరికి కేసీఆర్ కూడా బతికి ఉంటాడో లేదో తెలియదన్నారు.
ఇద్దరు, ముగ్గురు మంత్రులకు తప్ప ఇతర మంత్రులకు ప్రజల సంక్షేమం, పథకాలపై ఏ మాత్రమూ అవగాహన లేదని విమర్శించారు. సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ దానిని భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరిని దద్దమ్మలు అనే కేసీఆర్ ఎన్‌టీఆర్, చంద్రబాబు మంత్రి వర్గంలో పనిచేసిన ఆయన కూడా దద్దమ్మేనా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు పిట్టలదొర పద్మభూషణ్ డాక్టర్ అవార్డు కూడా ఇవ్వవచ్చని చురక అంటించారు.
ఒక్క పథకమూ అమలుచేయని కేసీఆర్
జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ కేసీఆర్ 102రోజుల పాలనలో ఒక్క పథకం కూడా అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు. రైతుల రుణమాఫీ, ఉచిత కరెంట్‌ను ఒక్క సంతకంతో అమలు పర్చారన్నారు. రుణమాఫీ కాని రైతులకు కూడా వైఎస్సార్ రూ.5 వేలు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేసి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ప్రతిపక్షాలను సన్నాసులని, చెల్లని రూపాయి అని విమర్శించడం తగదని కేసీఆర్‌కు హితవు పలికారు.
సంక్షేమ పథకాల అమలులో విఫలం
డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు కరెంట్ కోతలతో సతమతమవుతుంటే రుణమాఫీ అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సంక్షే మ పథకాలు అమలు చేయడంలో విఫలమైం దన్నారు. సర్కారు వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ప్రజలకు సినిమా చూపెడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రంగా మండిపడ్డారు.
అనంతరం జేసీప్రీతిమీనాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి సుంకరి మల్లేష్‌గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, కాంగ్రెస్ సర్పం చుల ఫోరం జిల్లా అధ్యక్షుడు శిశుపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల నారాయణగౌడ్, కాంగ్రెస్ ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పాశం రాంరెడ్డి, రవీందర్‌రెడ్డి, హన్మంతరావు, కత్తుల కోటి, కొంటేడి మల్ల య్య, పోలు డేవిడ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.