సాక్షి, పాలకుర్తి: తెలంగాణలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలువురు ఢిల్లీ నేతలు తెలంగాణకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాకు వచ్చారు. ప్రచారంలో పాల్గొని ప్రియాంక కీలక వ్యాఖ్యలు చేశారు.
జనగామ జిల్లాలోని పాలకుర్తిలో కాంగ్రెస్ బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా అనిపిస్తోంది. పాలకుర్తిలో ఒక కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేస్తే.. మరో కుటుంబం ప్రజల భూములు లాక్కుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజల త్యాగాల వల్ల ఏర్పడింది. త్యాగాల మీద ఏర్పాటైన రాష్ట్రం అభివృద్ధి చెందాలని భావించాం. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఆకాంక్షలు నెరవేరాలి. ప్రాణత్యాగం చేసిన అమరుల ఆకాంక్షలు నెరవేరాయో.. లేదో.. ప్రజలు ఆలోచించాలి.
యువత సాధించుకున్న ఈ తెలంగాణలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈ పదేళ్లలో ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? నిరుద్యోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది. ఈ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో ఎంతో అవినీతి జరిగింది. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో యువత నిరాశకు గురయ్యారు. కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక యువతి ఆత్మహత్య చేసుకుంటే ఆమె చావు గురించి ఈ ప్రభుత్వం వ్యంగ్యంగా మాట్లాడింది. ఆ యువతి పరీక్షకు దరఖాస్తు చేసుకోలేదని మాట్లాడారు. కాంగ్రెస్ గెలిస్తే.. నిరుద్యోగుల కష్టాలు తొలగిపోతాయి. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. పేపర్ లీకేజీలను అరికడతాం.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల కష్టాలు తొలగిపోతాయి. ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2,500 వేస్తాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. జీఎస్టీ వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయి. వస్తువుల ధరలు తగ్గాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి. కేసీఆర్ సర్కార్‌కు కాలం చెల్లిపోయింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
అలాగే, హుస్నాబాద్ సభలో ప్రియాంక మాట్లాడుతూ..‘ప్రజలు కోసం బీఆర్‌ఎస్ ఏం చేసిందో చెప్పగలరా?. ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు ఉద్యోం ఇచ్చారా? ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవి ఇచ్చుకున్నారు. కానీ, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎంతో కష్టపడి మీ పిల్లలను చదివించుకుంటున్నారు. వారి కష్టం వృథా అయిపోతోంది. ఇలాంటి ప్రభుత్వం మరో ఐదేళ్లు కావాలా?. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లు అవినీతితో కురుకుపోయాయి’
ప్రధాని మోదీ దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నాడు. అదానీ ఒక్క రోజ సంపద రూ.1600కోట్లు. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోటీనే. ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో 40-50 స్థానాల్లో పోటీచేస్తే తెలంగాణలో మాత్రం ఏడు స్థానాల్లోనే పోటీ చేస్తోంది. ఒవైసీ ఎప్పుడూ రాహుల్ గాంధీనే తిడుతుంటారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న దోస్తీని గుర్తించాలి. అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment