ఆమనగల్లు ప్రజా ఆశీర్వాద సభలో అభివాదం చేస్తున్న కేసీఆర్ సభకు హాజరైన జనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కల్వకుర్తి నియోజకవర్గం తలరాత మారాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే రెండేళ్లలోపు కచ్చితంగా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు తెచ్చే బాధ్యత తనదన్నారు. ‘ఎన్నో ఎన్నికలు.. పార్టీలు వచ్చాయి. ఎంతో మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎవరూ కల్వకుర్తి తలరాత మార్చలే. సాగునీరు.. తాగు నీరు రాలేదు. ప్రజలకు ఏం ప్రయోజనం కలుగలేదు. దీనికంతటికీ ఎవరు బాధ్యులో ఆలోచించాలి. ఎన్నికల్లో వ్యక్తులు గెలవడం ముఖ్యంకాదు. ప్రజల ఆకాంక్షలు గెలవాలి. ఇది టీఆర్‌ఎస్‌తో సాధ్యమవుతుంది. కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లులో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. భీకరమైన కరువు, దరిద్రం పోయి సాగు నీరు రావాలంటే కల్వకుర్తిలో టీఆర్‌ఎస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగిన నాయకులు ఉన్నా.. పేదరికం, వెనకబాటుతనం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు నాటి నుంచి నేటి దాకా పనికిమాలిన దందాలు చేశారని మండిపడ్డారు. వీరి కారణంగానే ప్రతిరంగంలో వెనకబాటుతనం ఉందని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో అన్నీ ధ్వంసం చేసినా కాంగ్రెస్ నాయకులు మిన్నకుండి పోయారని అన్నారు. చివరకు కులవృత్తులనూ చెడగొట్టారని, ప్రజల హక్కుల కోసం ఏనాడూ వాళ్లు కోట్లాడలేదన్నారు.
బాబు ఏంచేసిండు?
‘చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు మహబూబ్‌నగర్ జిల్లాని దత్తత తీసుకుని ఏం చేశాడో చూడలేదా? ఆయన కాలంలో తొమ్మిది సుక్కల నీళ్లైనా వచ్చినయా? నిరంతర కరెంటు, రైతుబంధు పథకం వచ్చిందా? నీటి తీరువా పన్నులు, భూమి శిస్తు వసూలు చేశారే తప్ప ప్రజలకు ఒరగపెట్టిందేమీ లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు కేసులు వేశారు. ఇప్పుడు ఓట్లు కావాలని మీ దగ్గరికి వస్తున్నారు. అంత సిగ్గు.. శరం లేకుండా ఉన్నామా మనం? మన వేళ్లతోని మన కళ్లలో పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
పాలమూరుకు నీళ్లు రానివ్వని బాబు తెలంగాణలో ఎలా పోటీ చేస్తారు? ఈ విషయంలో పాలమూరు రచయితలు, మేధావులు స్పందించాలి. గొర్రెల్లా, అమాయకుల్లా ఉండొద్దు’ అని కోరారు. నోట్ల కట్టలు ఇస్తానంటే ఎవరూ అమ్ముడు పోవద్దని, పౌరుషం లేకుండా ఉంటే బతుకులు వ్యర్థమైతాయని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేస్తోందన్నారు. ఇప్పటికే 30 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని, 30 చెరువులకు నీళ్లు వచ్చాయని వివరించారు. జిల్లాలో 80 కొత్త పంచాయతీలు ఏర్పాటైతే.. ఇందులో 57 తండాలు పంచాయతీలుగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ఈ పంచాయతీలన్నింటినీ ఇకపై లాంబాడీలే పాలించుకుంటారని చెప్పారు.
ఆమనగల్లుకు వరాలు
అధికారంలోకి రాగానే కల్వకుర్తి నియోజకవర్గ దశ తిరుగుతుందని కేసీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ అభ్యర్థన మేరకు ఆమనగల్లుపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీకి విరివిగా నిధులు విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతమున్న ప్రభుత్వ ఆస్పత్రి సామర్థ్యాన్ని 150 పడకలకు పెంచుతామని చెప్పారు. ఈ సభలో టీఆర్‌ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment