ములుగు సభలో మాట్లాడుతున్న కేసీఆర్, పక్కన అభ్యర్థి చందూలాల్
సాక్షి, ములుగు: ప్రజల చిరకాలవాంఛ అయిన ములుగు జిల్లాను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయవచ్చనే విషయంపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఉదయమే మాట్లాడానని చెప్పారు. పార్టీ అభ్యర్థి అజ్మీరా చందూలాల్‌ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే డిసెంబర్ 12 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని జనవరి 24న స్వయంగా వచ్చి జిల్లాను ప్రారంభించి ములుగు ప్రజలకు బహుమానంగా ఇస్తా.. అలాగే మంల్లంపల్లిని మండలంగా చేస్తానని చెప్పారు. గిరిజనులకు రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. దేవాదుల ద్వారా రామప్ప చెరువుకు నీటిని సరఫరా చేసి అక్కడి నుంచి కాల్వల ద్వారా గణపురం, లక్నవరం చెరువులు నింపి ఏడాదిలో 365 రోజుల పాటు పంటలకు సాగునీరందిస్తామని అన్నారు. కళ్యాణలక్ష్మి పథకానికి ములుగు మండలం భాగ్యతండాలోనే బీజం పడిన విషయాన్ని మరోసారి గుర్తు చేసిన కేసీఆర్ ఈ పథాకానికి మొదట్లో రూ.50వేలు కేటాయించగా.. రాష్ట్ర ఆదాయం పెరిగిన కొద్ది రూ.75,116, ఆ తర్వాత రూ.100,116 కు పెంచామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment