సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ అవసరాలు స్థానికంగా ఏర్పాటు చేసే థర్మల్ ప్రాజెక్టుల ద్వారానే తీరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. సింగరేణి సంస్థ ద్వారా ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్‌లో రెండు 600 మెగావాట్ల యూనిట్ల ద్వారా ఉత్పత్తి అవుతున్న 1200 మెగావాట్ల విద్యుత్తును పూర్తిస్థాయిలో గజ్వేల్ పవర్ గ్రిడ్‌కు పంపిస్తున్న ప్రభుత్వం, భవిష్యత్ అవసరాల కోసం ఎన్టీపీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఎన్‌టీపీసీ ద్వారా రామగుండంలోనే ఉత్పత్తి అయ్యేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.
ఇందులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే రామగుండంలో ఆమోదం పొందిన 1600 మెగావాట్ల (800 మెగావాట్ల 2 యూనిట్లు) విద్యుత్ ప్రాజెక్టును రాష్ట్ర అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) శరవేగంగా పూర్తి చేస్తోంది. జాతీయ స్థాయి ప్రాజెక్టు అయినప్పటికీ, బొగ్గు, నీరు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తూ, అందులో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను కూడా రాష్ట్ర అవసరాలకే వినియోగించుకు ఒప్పందంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. మూడేళ్ల క్రితం రామగుండంలో మొదలైన ఎన్‌టీపీసీ తెలంగాణ స్టేజ్–1 విద్యుత్ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేదశకు చేరుకున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నేపథ్యంలో స్టేజ్–2 కింద మరో మరో మూడు యూనిట్లలో 800 మెగావాట్ల చొప్పున 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం థర్మల్‌ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కాళే«శ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు విద్యుత్ వినియోగం అధికంగా అవసరమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ట్రాన్స్‌కో, జెన్‌కో, సింగరేణి అధికారులు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రామగుండం పర్యటన శనివారం ఖాయం కావడంతోఆయా విభాగాల అధికారులు తమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటనతో స్టేజ్–1 పనులు వేగవంతం కావడమే కాక, స్టేజ్–2 అనుమతులు కూడా వీలైనంత తొందరలోనే లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
సీఎంతో కీలక సమావేశం నేడు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనధికారిక షెడ్యూల్ ప్రకారం... శనివారం ఉదయం ఆయన ఎన్టీపీసీ గెస్ట్‌హౌజ్‌కు చేరుకుని తెలంగాణ స్టేజీ వన్ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడంతోపాటు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టుకు ఎన్టీపీసీ బోర్డుఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపి, సంతకాలు కూడా పూర్తయిన నేపథ్యంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం–ఎన్టీపీసీ సంస్థతో కుదిరితేనే రెండోస్టేజ్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించే అవకాశం ఉంది.
ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ స్టేజీ వన్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పనుల పర్యవేక్ష సమావేశం జరుగనుంది. ఎన్టీపీసీ సీఅండ్‌ఎండీ గురుదీప్‌సింగ్, జెన్‌కో సీఅండ్‌ఎండీ ప్రభాకర్‌రావు, సింగరేణి సీఅండ్‌ఎండీ శ్రీధర్‌తోపాటు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కానున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం అవసరం ఉన్న నేపథ్యంలో రెండో ప్రాజెక్టు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. 800మెగావాట్ల చొప్పున మూడు యూనిట్లు నిర్మించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన భూమి, నీరు, సింగరేణి బొగ్గు అందుబాటు ఉండడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం కీలకంగా మారనుంది. శనివారం రామగుండం ఎన్టీపీసీకి రానున్న నేపథ్యంలో తెలంగాణా స్టేజ్–2 నిర్మాణానికి మోక్షం లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
శరవేగంగా స్టేజ్–1 నిర్మాణం పనులు
స్టేజ్–1 ప్రాజెక్టులో 800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనుకున్న సమయానికి మే 2020లోనే తెలంగాణ స్టేజ్–1 ప్రాజెక్టు ఉత్పత్తి దశలోకి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. 2016 జనవరి 29న పనులు ప్రారంభించి 70 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 8 డిసెంబర్ 2017న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాంటు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఇప్పటికే 2600 మెగావాట్ల థర్మల్ పవర్, 10 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తితో తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్న ఎన్టీపీసీ, తెలంగాణ విద్యుత్ సమస్యలు తీర్చేందుకు మరో 1600 (800చొప్పున రెండు) మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు మొదటి దశ పనులు వేగంగా చేస్తోంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం అంచనా రూ.10,598.98.
స్టేజ్–2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ లభిస్తే మరో 2,400మెగావాట్లు..
రెండవ దశలో 2400 మెగావాట్ల (800 చొప్పున3) ప్రాజెక్టు నిర్మాణానికి సైతం బోర్డు ఆమోదం తెలిపింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేసేందుకు ఎన్టీపీసీ సంస్థ పూర్తి స్థాయి చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం–2014 ప్రకారం బొగ్గు ఆధారిత 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటును తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో 1600 మెగావాట్లు, రెండో దశలో 2400 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా ఉత్పత్తి జరగాల్సి ఉంది.
పవర్ హబ్..
ప్రస్తుతం ఉన్న 2,600, 10 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుతోపాటు కొత్తగా చేపట్టనున్న స్టేజ్–1, స్టేజ్–2 ప్రాజెక్టుల ద్వారా 4,000వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కలుపుకొంటే.. 6,610 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా రామగుండం ఎన్టీపీసీ అభివృద్ధి చెందనుంది. సింగరేణి బొగ్గుగనుల నుంచి బొగ్గు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీరు అందుబాటులో ఉన్నాయి. మేడిపల్లి సింగరేణి ఓసీపీ జీవిత కాలం పూర్తవుతున్న క్రమంలో దానిని యాష్‌పాండ్ కోసం ఎన్టీపీసీ సంస్థ వినియోగించుకోనున్నది.
తెలంగాణలో ఎన్టీపీసీ సంస్థ మొదటి దశ 1600, రెండవ దశ 2400మెగావాట్లు మొత్తంగా నిర్మించే 4000 మెగావాట్ల విద్యుత్ కేంద్రం రామగుండంలోనే నిర్మితమవుతున్నట్లు స్పష్టమైంది. దీంతో భారత దేశంలో కెల్లా అతిపెద్ద థర్మల్ కేంద్రంగా రామగుండం నిలువనున్నది. ఎన్టీపీసీ ప్రస్తుతం ఉన్న ఎంజీఆర్ అన్‌లోడింగ్ బల్బ్ ఏరియాలోని అందుబాటులో ఉన్న దాదాపు 235 ఎకరాల స్థలంలో ప్రతిపాదించబడిన ప్రాజెక్టు ఏర్పాటు జరుగుతుంది. తెలంగాణ స్టేజీ–2(3్ఠ800=2400) కోసం ఎన్టీపీసీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment