వరంగల్: 60 ఏళ్ల ప్రజల ఆకాంక్ష, ఎంతో మంది మేధావుల కల, అమరవీరుల ఆత్మబలిదానాలతో దక్కించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాపత్ర యం పడుతున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో రకాల దోపిడీకి గురైన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతోనే ప్రణాళికలను రూపొందిస్తున్నారన్నారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల శాసనమండలి ఎన్నికల సందర్భంగా హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్స్‌లో టీఆర్‌ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు అధ్యక్షతన ఆదివారం జరిగిన సభలో శ్రీహరి ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, సీఎంగా కేసీఆర్ తొమ్మిది నెలల పాలనపై ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ఎలా దోపిడీకి గురైందన్న విషయాలను పట్టభద్రులకు తెలియజెప్పి కేసీఆర్ ఆశ్వీర్వాదంతో ఎమ్మెల్సీగా పోటీచేస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాజేశ్వర్‌రెడ్డి ధర్మసాగర్ మండలం సోడషపల్లిలో పుట్టి, ఖమ్మం జిల్లాలో ఇంటర్ విద్యనభ్యసించి, ఉన్నత విద్య హైదరాబాద్‌లో పూర్తి చేసి, నల్లగొండలో విద్యాసంస్థలను నెలకొల్పి, ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలకు రూపకల్పన చేసిన విషయాలను పట్టభద్రుల ఓటర్లకు విశదీకరించాల్సిన బాధ్యత తెలంగాణ గ్రాడ్యుయేట్స్‌పై ఉందన్నారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వర్గానికి ప్రయోజనాలు కల్పిస్తున్న గొప్ప వ్యక్తి కే సీఆర్ అని కొనియాడారు. నేటి విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా మారిందని, దీన్ని ప్రక్షాళన చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
తెలంగాణలోని పేద బిడ్డకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు విద్యావేతలతో చర్చిస్తూ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నామన్నారు. సీఎం ఆమోదించిన అనంతరం జిల్లాల వారిగా సమీక్షలు ఏర్పాటు చేసి అందరి సలహాలు తీసుకుంటామన్నారు. ఇందు కోసం ఈ బడ్జెట్‌లో రూ.వేయి కోట్లు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. 2018 చివరి నాటికి ప్రతి ఇంటికి నీరు అందించకుంటే ఎన్నికలకు పోను అన్న సీఎంను మొదటిసారిగా చూశామన్నారు. సన్నాహక సమావేశంలో విద్యావేత్తలు, సంఘాల నాయకుల సూచనలు తీసుకోలేకపోయిందుకు క్షమించాలన్నారు.
మొదటి వారంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షలు నిర్వహిస్తామని, అప్పుడు అందరి సూచనలు తీసుకుంటామని శ్రీహరి తెలిపారు. అంధ్రావాళ్లను తరిమికొట్టి రాష్ట్రాన్ని సాధించిన స్ఫూర్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించుకోవాలని గిరిజన, పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చినా...ఆర్థిక స్వాతంత్య్రం రాలేదని, అందుకోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతోందని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నావంతు పాత్ర ఉందన్నారు. ఉద్యమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటిలో నిర్వహించిన యాత్రలో అరెస్టు అయినట్లు తెలిపారు. 11కేసులు, 22 సెక్షన్లు పెట్టి చంచల్‌గూడ జైల్లో విద్యార్థి జేఏసీతో కలిసి ఉన్నట్లు పేర్కొన్నారు.
విద్యా సంస్థలు అంటే వ్యాపారం నిజం అయినప్పటికీ... కాలేజీలు స్థాపించి 1500మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. సోషలిజం వచ్చి ప్రైవేటు సంస్థలను జాతీయం చేయాలంటే ముందు వరసలో తాను ఉంటానన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవీ ఉన్నప్పుడే టీఆర్‌ఎస్‌లో చేరానని, పదవీ లేకున్నా కేసీఆర్ సూచనలే శిరోధార్యంగా ముందుకు వెళతానని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న రాజే శ్వర్‌రెడ్డిని గెలిపించాలని జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ కోరారు.
పార్టీలోని నేతలు, పట్టభధ్రులు, తెలంగాణ సంఘాల నేతలంతా ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేసుకుంటూ రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని మాజీ జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు అన్నారు. సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీలు నాగపురి రాజలింగం, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, కొండా సురేఖ, అరూరి రమేష్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యీ సత్యవతి రాథోడ్, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాజయ్యయాదవ్, అర్భన్ పార్టీ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్, రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, బీరవెళ్లి భరత్‌కుమార్‌రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్‌రావు, ఎల్లావుల లలితాయాదవ్, వాసుదేవరెడ్డి, జోరుక రమేష్‌లతో పాటు పలువురు నాయకులు, ప్రజా, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
బంగారు తెలంగాణే కేసీఆర్ లక్ష్యం
Published Mon, Mar 2 2015 3:25 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement