ఎట్టకేలకు.... | KCR holds meeting with Cabinet panel on farm loan waiver | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు....

Published Tue, Sep 23 2014 1:16 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

KCR holds meeting with Cabinet panel on farm loan waiver

 నల్లగొండ అగ్రికల్చర్ :మూడు నెలలుగా రుణమాఫీ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం కేసీఆర్ సోమవారం రుణమాఫీకి ఆమోదముద్ర వేశారు. లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ఇటీవల టీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీపై ప్రకటన చేసింది. దీనిపై పలు నిబంధనలు విధిస్తూ ప్రకటనలు చేయడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. అయితే  రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని దాదాపు ఐదు లక్షల మంది రైతులు ఊరట పొందారు. సుమారు రూ. 2550 కోట్ల మేర పంట రుణాలు మాఫీఅయ్యే అవకాశమున్నట్లు జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీధర్ తెలిపారు. బంగారు రుణాలపై స్పష్టమైన ఆదేశాలు ఏమీ తమకు అందలేదని తెలిపారు. ఏదిఏమైనా ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న పంటరుణాలపై స్పష్టత రావడంతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
 కేసీఆర్‌తోనే పేదల సంక్షేమం : చాడ కిషన్‌రెడ్డి
 నల్లగొండ రూరల్ : కేసీఆర్‌తోనే పేదల సంక్షేమం సాధ్యమని... ప్రతి పేదవ్యక్తి సొంత కాళ్లపై నిలబడేలా చేయడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి  చాడ కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా సోమవారం రైతుల రుణమాఫీకి ప్రభుత్వం రూ. 4250 కోట్లు విడుదల చేయడం పట్ల  ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు  నల్లగొండలోని  క్లాక్‌టవర్‌వద్ద స్వీట్లు పంపిణీ చేసుకుని, బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం 100 శాతం అమలు చేస్తుందన్నారు.
 
 పేదల కోసం గృహ నిర్మాణం, నియోజకవర్గానికి సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తుందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో గ్రామాల ముంపునకు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డిలే కారణమన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ నాయకులు వ్యతిరేకించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయడంతోపాటు జురాల నుంచి పాకాల వరకు కాల్వలు తవ్వి రైతుల బీడు భూములకు సాగునీరు అందిస్తామని తెలిపారు.  విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని విమర్శించడం అర్థరహితమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి బక్కా పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, సత్తిరెడ్డి, జమాల్, శివరామకృష్ణ, బిక్షం, మోహన్, పున్న గణేష్, నాగార్జున, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
 
 యూనివర్సిటీలో...
 రుణమాఫీ పట్ల యూనివర్సిటీలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతుల ప్రయోజనం కోసం రుణమాఫీ చేయడం హర్షించదగ్గ విషయమని టీఆర్‌ఎస్వీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగోని వెంకన్న, శంకర్, పల్లయ్య, శ్రీను, ఆంజనేయులు, భాస్కర్‌రెడ్డి, బాబు, రాము, దస్రునాయక్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement